– రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
– భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుకు హామీ
నకిరేకల్, జులై 05 : హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెందిన కుర్రి శ్రీను మృతిచెందిన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తీరును నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ స్థితిగతులను వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీను రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరం అన్నారు.
శ్రీను కుటుంబానికి తక్షణమే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఇద్దరు ఆడపిల్లలను ఉన్నతంగా చదివిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల నగదును అందజేశారు. మంత్రితో పాటు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప, ప్రజా ప్రతినిధులు గాదగోని కొండయ్య, నకిరేకంటి ఏసుపాదం, లింగాల వెంకటేశ్వర్లు, పన్నాల రాఘవరెడ్డి, గాజుల సుకన్య, కౌన్సిలర్లు ఉన్నారు.