నీలగిరి, ఆగస్టు 29: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారని, అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగులు భృతి కోసం..,నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కోసం విద్యార్థినులు సూటీల కోసం, రైతులు రుణమాఫీ, రైతు భరోసా, యూరియా, కరెంటు కోతలపై అసెంబ్లీలో అడగమని కోరుతున్నారని చెప్పా రు. రాష్ట్రంలో వర్షాలు, వరుదల కారణంగా ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే వారిని ఆదుకోవాలనే సోయి కూడా ప్రభుత్వానికి లేకుం డా పోయిందన్నారు. ఓ వైపు భారీ వర్షాలు… మరోవైపు యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం రైతులు రోడ్డుపైకి రాలేదని, యూరియానే వారి ఇంటికి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందోనని కేసీఆర్ భయపడ్డారో.. నేడు అదే జరుగుతుందని అవేదన వ్యక్తం చేశా రు. కాళేశ్వరం నివేదిక అసెంబ్లీలో ప్రవేశ పెడి తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, వాస్తవికంగా ఉన్న నివేదికను బహిరంగ పర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అబద్ధాలతో కూడా కాంగ్రెస్ నివేదకను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం ఎప్పటిలాగే రోత మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వర్షాలపై రివ్యూ చేసి ప్రజలకు ధైర్యం చేసేందుకు ఏ మంత్రికి కూడా సోయి లేకుండా పోయిందన్నారు. వరదల కారణంగా వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని దానిని మళ్లించి ప్రజలకు వినియోగంలోకి తేచ్చే నాథుడే కరువయ్యాడని చెప్పారు. నల్లగొండలో మూడు లక్షల జనాభాతోపాటు ఉమ్మడి జిల్లాకు తాగునీరు అందించే ఉదయసముద్రం రిజర్వాయలో నీరు లేదని, దానిని నింపాలనే సోయి జిల్లా మంత్రులకు లేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో కాంగ్రెస్ మరో కొత్త డ్రామకు తెరలేపిందన్నారు. ఎన్నికలు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్డు చెబితే, రెండు నెలలు నిద్రపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నెల వ్యవధిలో ఎన్నికలు జరిపేందుకు హడావుడి చేస్తుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఓవైపు వర్షాలతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయి జనజీనవం స్తంభిస్తుంటే.. ప్రభుత్వం సక్రమంగా లేని ఓటర్ లిస్టులు పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. అన్ని గ్రామాల్లో ఓటర్ జాబితాలను బహిరంగ పర్చి అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించిన తరువాతే ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సమావేశం లో కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లబోతు భాస్కర్‌రావు, బోనగిరి దేవేందర్, తుమ్మల లింగస్వామి, దేప వెంకట్‌రెడ్డి, బడుపుల శంకర్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున తదితరులు ఉన్నారు.