కట్టంగూర్, జూలై 29 : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలానికి నూతనంగా మంజూరైన 1,903 రేషన్ కార్డులు, 52 కల్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇవ్వడం లేదన్నారు. సన్న వండ్లు పండించేలా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో నూతనంగా 8,231 రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ కుమార్ మాట్లాడుతూ.. పేదలకు రేషన్ కార్డులు రావడం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతాయన్నారు. నల్లగొండ జిల్లాలో 62,100 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డిఎస్ చౌహన్,
మిర్యాలగూడెం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి, ఇన్చార్జి తాసీల్దార్ వెంకటేశ్వరావు, మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్ రావు, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, డీటీ ప్రాంక్లిన్ ఆల్బట్, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, నాయకులు శ్యామల శ్రీనివాస్, బచ్చులపల్లి గంగాధర్ రావు, గాజుల సుకన్య, రెడ్డిపల్లి సాగర్, రెడ్డిపల్లి వీరస్వామి, మిట్టపల్లి శివ, ముక్కాముల శేఖర్, అనిల్ రెడ్డి, బూరుగు శ్రీను, దార భిక్షం, మర్రి రాజు పాల్గొన్నారు.