సూర్యాపేట నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందిస్తామని, తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు ఉండాలన్నది సీఎం కేసీఆర్ తపన అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. సమైక్య పాలనలో చెప్పులు అరిగేలా తిరిగినా సర్కారు సాయం, సంక్షేమ పథకాలు అందేవి కాదని, ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత వచ్చినా కమీషన్లకే సరిపోయేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికీ ఒకటి కంటే ఎక్కువే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల మండలాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు మంత్రి శుక్రవారం గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్లకుపైన పాలించిన కాంగ్రెస్ పార్టీతో సూర్యాపేట నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. ఏడున్నర దశాబ్దాల్లో జరుగని అభివృద్ధిని తొమ్మిదిన్నరేండ్లలో రూ.7500 కోట్లతో చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్‌లు పచ్చి బోగస్ అని, కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. అంతకుముందుకు సూర్యాపేట 5, 6 వార్డుల్లోని వస్రాం తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 30 : కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మళ్లీ అంధకారమే వస్తుందని, మోసపోతే గోస పడుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు, బాధలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. ఆయన సారథ్యంలోనే రాష్ట్రంలో పేదలందరికీ గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్లు నిర్మాణం చేస్తామని తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చివ్వెంల, సూర్యాపేట మండలాల లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇల్లు లేని మనిషి ఉండకూడదనేదే సీఎం కేసీఆర్ తపన అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలో ఒకే రోజు సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల మండలాల్లో 1,700 మందికి గృహలక్ష్మి పత్రాలు అందించడం సంతోషంగా ఉన్నదన్నారు.
60 ఏండ్లకు పైబడి పాలించిన కాంగ్రెస్ పార్టీతో సూర్యాపేట నియోజక వర్గానికి ఒరిగిందేమి లేదన్నారు. 60 ఏండ్లలో చేయని అభివృద్ది ఇప్పుడెలా చేస్తారని ప్రశ్నించారు. కేవలం 9 సంవత్సరాల కాలంలోనే రూ.7,500 కోట్లతో అభివృద్ధి చేసిన విధానాన్ని గర్వంగా చెప్పుకుంటున్నట్లు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం నియోజక వర్గంలోని చిన్న గ్రామ పంచాయతీకి రూ.10 కోట్ల నుంచి పెద్ద గ్రామ పంచాయతీకి రూ.50 కోట్లు ఖర్చు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పుడు ఆరు గ్యారంటీలంటూ ప్రజలను మోసం చేయడానికి వస్తుందని మండిపడ్డారు. మాయ మాటలతో మరోసారి ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్ నాయకుల పట్ల తెలంగాణ సమాజమంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వారు వచ్చే ముందు 2014 ముందున్న పరిస్థితులను బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుతమున్న పరిస్థితులను గుర్తు చేయాలన్నారు.
మూసీ మురుగు నీరు తాగించిన కాంగ్రెస్
2014 ముందు తాగునీటి కోసం కిలోమీటర్లు నడిచి వెల్లి తెచ్చుకునేవారు. హైదరబాద్ మురుగునీరు తాగిన పరిస్థితులు సూర్యాపేట ప్రజలకు తెలుసన్నారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి కోసం స్వచ్ఛమైన నది జలాలు ప్రతి ఇంటికి అందిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. సూర్యాపేటలో ప్రభుత్వ వైద్యం చేయించుకోవాలంటే ఆరుగురు మాత్రమే వైద్యులు ఉండేవారని కానీ ఇప్పుడు 250 మంది వైద్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాల ద్వారా సూర్యాపేట మెడికల్ హాబ్‌గా మారిందన్నారు. మరో రెండు రోజుల్లో 200 మంది ఐటీ ఉద్యోగాలతో ఐటీ హాబ్ను ప్రారంభించుకోవడం జరుగుతుందని చెప్పారు.
లబ్ధిదారులందరికీ ఇండ్లు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తుందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ప్రభుత్వం అందిస్తున్న గృహలక్ష్మి పథకం సూర్యాపేట నియోజకవర్గంలోని ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ వర్తింపజేయనున్నట్లు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ గ్యారంటీ స్కీములు పచ్చి బోగస్..
ఆత్మకూర్.ఎస్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ కార్డు పథకాలు పచ్చి బోగస్ అని కర్ణాటకలో అధికారంలోకి వచ్చాక ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మండలంలోని నెమ్మికల్ ఎస్వీ ఫంక్షన్ హాల్లో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగుతాయన్నారు. దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. అనంతరం 625 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూడి నరసింహారావు, బత్తుల రాజేంద్రప్రసాద్, సర్పంచ్ గంపల దావీద్, ఎంపీటీసీ ముత్తయ్య, ఎంపీడీఓ మన్సుర్నాయక్, ఎంపీఓ సంజీవ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పూలతో మంత్రికి ఘన స్వాగతం..
గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను అందించేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. పత్రాలు అందుకోవడానికి వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షంతో స్వాగతం పలికారు. స్వంతింటి కల సాకారం చేస్తున్న నాయకుడికి అండగా ఉంటామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, చివ్వెంల ఎంపీపీ కుమారి, సూర్యాపేట ఎంపీపీ రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీలు సంజీవ్‌నాయక్, జీడి భిక్షం, వైస్ ఎంపీపీ జులకంటి జీవన్‌రెడ్డి, కౌన్సిలర్ బాషా, పలువురు నాయకులు పాల్గొన్నారు.