– రూ.100 కోట్లతో కోదాడ బాలాజీనగర్లో 362 ఇండ్లను నిర్మించిన బీఆర్ఎస్ ప్రభుత్వం
కోదాడ, జనవరి 09 : వారం రోజుల్లోగా కోదాడలోని బాలాజీ నగర్లో బీఆర్ఎస్ పాలనలో రూ.100 కోట్లతో నిర్మించిన 362 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించకపోతే లబ్ధిదారులతో కలిసి ఉద్యమం చేస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పటి కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా సమీపంలోనే విద్యుత్ సబ్ స్టేషన్, హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించకపోవడం దారుణం అన్నారు. రూ.50 లక్షలతో విద్యుత్ సౌకర్యం కల్పిస్తే లబ్ధిదారులు ఇళ్లకు చేరవచ్చని అయినప్పటికీ ఇక్కడ ప్రాతినిధ్య వహించే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ వెలువరించిన పిపిటి కి రూ.85 లక్షలు ఖర్చు అయిందని అందులో సగం ఖర్చు పెడితే లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రజలకు తక్షణ అవసరమైన సమస్యలు పరిష్కరించకుండా నిరుపయోగమైన ఉత్తమ పద్మావతి ఎత్తిపోతల ప్రాజెక్టు మాత్రం వేల కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జనాభాకు అనుగుణంగా శానిటేషన్ సిబ్బందిని తమ ప్రభుత్వ పాలనలో పెంచినప్పటికీ ప్రస్తుత వారిని అకారణంగా విధుల నుండి తొలగించిన ఫలితంగా పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తమైందన్నారు.
ఉత్తమ్ దంపతులకు నియోజకవర్గ సమస్యలు పట్టడం లేదని, ప్రజలు తమ గోడును విన్నవించుకునేందుకు సమయం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. సమస్యల పరిష్కారానికి అనివార్యమైన పరిస్థితిలో లబ్ధిదారులతో కలిసి ఉద్యమ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు షేక్ నయీం, హనుమాన్ నాయక్, మాజీ కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్, మామిడి రామారావు, అలవాల వెంకట్, మేదరి లలిత, కర్ల సుందర్ బాబు, పిట్టల భాగ్యమ్మ, దొంగరి శ్రీనివాస్, చలిగంటి వెంకట్, రవి, చినబాబు, రాణి పాల్గొన్నారు.

Kodada : వారంలోగా లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించకపోతే ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్