సూర్యాపేట, ఏప్రిల్ 4(నమస్తేతెలంగాణ) : సూర్యాపేట మెడికల్ కళాశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కళాశాల ప్రాంగణంలో వెయ్యి సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు, విద్యార్థుల రవాణా సౌకర్యం కోసం రెండు బస్సులను మంజూరు చేశారు. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో శుక్రవారం రాత్రి 2019-2025 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల పినాకిల్ కాన్వకేషన్ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందించి నూతన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సమాజానికి వైద్య సేవలు అందించడంలో వైద్య విద్యార్థుల పాత్ర కీలకంగా ఉందన్నారు. వైద్యులుగానూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి వచ్చిన నిరుపేద విద్యార్థులకు మెడిసిన్ విద్యను అందించేందుకు ఏర్పాటైన దేవాలయమే సూర్యాపేట మెడికల్ కళాశాల అని, ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. సూర్యాపేట జిల్లాగా ఏర్పాటైన తరువాత నాటి సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చినప్పుడు సూర్యాపేట ప్రజల ఆదరాభిమానాలు చూసి మెడికల్ కళాశాలను మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. నూతన జిల్లాకు ఎలాంటి వసతులు ఉండాలి, రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఎక్కడెక్కడ ఉండాలని ఆలోచన చేసి సూర్యాపేటకు కూడా ఇచ్చారని తెలిపారు. ప్రకటన చేసిన మరుక్షణం నుంచి ఆలస్యం చేయకుండా మన పిల్లలు ఒక సంవత్సరం ముందే డాక్టర్లయ్యే అవకాశం పోనివ్యద్దని అధికారులను సమాయత్తం చేసి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నామన్నారు. కళాశాల ఏర్పాటుకు కావాల్సిన వసతులను పరిశీలించి, కొన్ని తక్కువున్నా ఎలాగైనా సాధించాలని ప్రణాళిక మొదలుపెట్టామని తెలిపారు.
అధికార యంత్రాంగంతో మాట్లాడి డిగ్రీ కళాశాల స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ఎగ్జిబిషన్ సొసైటీని సంప్రదించి 2019లోనే కళాశాలను ప్రారంభించుకున్నామన్నారు. ఎంసీఏ ఇన్స్పెక్షన్ వచ్చే నాటికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసి వారిని సంతృప్తి పరిచి కళాశాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకున్నారని, ఏ సమస్య ఉన్నా ప్రతి సందర్భంలో తన వద్దకు వచ్చి సలహాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇవ్వలేనివి ఉంటే మీరు వేరే పద్ధతుల్లో సాయం చేయాలని చెప్పి మరీ పనులు చేయించుకున్నట్లు గుర్తు చేశారు. కళాశాలను నడుపడంలో ప్రధానంగా పాత ప్రిన్సిపాల్, సూపరిండెంట్ కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ ఐదేండ్లు మంచి పద్ధతుల్లో కళాశాలను నడుపుకొని 150 మంది విద్యార్థులు డాక్టర్లు అవడం సంతోషంగా ఉందన్నారు.
ప్రస్తుతం కళాశాలకు 25 పీజీ సీట్లు వచ్చాయన్నారు. కొవిడ్ సమయంలో అద్భుతమైన సేవలను అందించిన కార్పొరేట్ దవాఖానలను తలదన్నేలా సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల రోగులకు ప్రాణాలు పోసిందని అభినందించారు. ఈ సేవలనుగానూ జాతీయ అవార్డు కూడా లభించినట్లు తెలిపారు. దేశంలోని మంచి కళాశాల్లో ఒకటిగా మన సూర్యాపేట మెడికల్ కళాశాల నిలిచిందన్నారు. అందువల్లే ఈ కాలేజీని ఎక్కువమంది విద్యార్థులు ఆప్షన్ పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టాలు పొందిన డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకొని సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కేఎన్ఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.వి.నందకుమార్, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహ, ఫార్మర్ ప్రిన్సిపాల్ శారద, ఫార్మర్ సూపరిండెంట్ మురళీధర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ ఎన్.జయలత, సూపరింటెండెంట్ జె.సత్యనారాయణల, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.