కోదాడ, ఫిబ్రవరి 13 : తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని, కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థులు తెలిపారు. కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. 5వ వార్డులో కందుల చంద్రశేఖర్ 70 ఓట్ల మెజారిటీతో, 9వ వార్డులో చీమ నరేష్ 50 ఓట్ల మెజార్టీతో, 10వ వార్డులో మామిడి రామారావు 75 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించారు. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తమపై నమ్మకంతో కౌన్సిల్ అభ్యర్థులుగా ఖరారు చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సూర్యాపేట ఎస్వీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగగా 35 వార్డులకు గాను 27 వార్డుల్లో ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక బీఆర్ఎస్ మూడు స్థానాలను కైవసం చేసుకోగా మరో ఐదింటిలో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.