మునుగోడు, ఆగస్టు 28 : విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. గురువారం మునుగోడు కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల 25వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పోరాట మృతవీరులు విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడంతో గ్రామాల్లో అనేక రకాల సమస్యలు పేరుకు పోయాయని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్మిస్తుస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సాగర్ల మల్లేశ్, మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి శ్రీను, కల్వలపల్లి గ్రామ కార్యదర్శి వంటెపాక అయోధ్య, డోలు దెబ్బ వ్యవస్థాపకుడు మాల్గా యాదయ్య పాల్గొన్నారు.