మిర్యాలగూడ, జూలై 10: క్షయ (టీబీ)ను జిల్లా నుంచి పూర్తిగా నిర్మూలించి టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మిర్యాలగూ డ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ఏఎన్ఎం లు, ఆశ కార్యకర్తలు విధులను సాధారణ పద్ధతిలో కాకుండా గుర్తింపు వచ్చేలా పనిచేయాలన్నారు. అక్టోబర్ 2 నాటికి టీబీ రహితంగా నల్లగొండ జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆశలు, ఏఎన్ఎంలు గ్రామాలకు వెళ్లి ప్రజలకు టీబీపై అవగాహన కల్పించాలన్నారు. రెండు వారాలకు మించి దగ్గు వచ్చే వారిని గుర్తించి, పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో రైసు మిల్లులు ఎక్కువగా ఉండడం, దుమ్ముధూళి ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంలోని ప్రజలకు టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ప్రజలకు ప్రత్యేకించి రైసు మిల్లుల్లో పనిచేసే వారు, డ్రైవర్లు, హమాలీలు, ఇతరులందరికీ పరీక్షలు నిర్వహించేందుకు ఓ షెడ్యూల్ రూపొందించాలని సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు.
వివరాలను ఎప్పటికప్పుడు డేటాలో ఎంట్రీ చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు ప్రతి గ్రామ పంచాయతీని సందర్శించి టీబీపై అవగాహన కల్పించాలన్నారు. బాగా పనిచేసే ఆశ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను సన్మానిస్తామన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రూ.20లక్షల విలువ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌రే మిషన్‌ను వైద్యారోగ్యశాఖకు ఇస్తున్నందుకు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, టీబీ నియంత్రణ అధికారి కల్యాణ్ చక్రవర్తి, డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్, జిల్లా దవాఖానల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు వేణుగోపాల్‌రెడ్డి, రవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీశ్, డీఎస్వో వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, సంఘం కార్యదర్శి బాబి, ప్రతినిధులు భద్రం, వైద్యాధికారులు పాల్గొన్నారు.