నల్లగొండ నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 09 : ఆదర్శ ప్రజా నాయకుడు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమించాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నారి అయిలయ్య, పాలడుగు నాగార్జున అన్నారు. బుధవారం నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో అమరజీవి నర్రా రాఘవరెడ్డి 10వ వర్ధంతి సభను నిర్వహించారు. సభకు ముఖ్య అతిథులుగా హాజరై అయిలయ్య, నాగార్జున ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన భారాలను మోపినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నాయని, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఎప్పటి వరకు ఇస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇచ్చి సన్న బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేయాలన్నారు. యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలన్నారు. ఫ్లోరైడ్ విముక్తి పోరాటంలో అలాగే ఎస్ఎల్బీసీ సొరంగంకై సాగిన పోరాటంలో నర్రా రాఘవ రెడ్డి ప్రముఖులని అన్నారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ నుంచి విముక్తి చేయాలనే తపనతో ఎస్ఎల్బీసీ సొరంగం అయితే ఆలస్యం అవుతుందని నార్ల తాతారావును వెంట బెట్టుకుని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్ ద్వారా పూర్తి చేయాలని సూచించారు. అందుకు అనుగుణంగానే నేటి ఎస్ఎల్బీసీ లిఫ్ట్ స్కీమ్ అన్నారు.
నర్రా రాఘవరెడ్డి నకిరేకల్ నియోజకవర్గంలో ప్రతి పెద్ద ఊర్లో హైస్కూలు నిర్మాణం చేయించారని, మంచినీటి సమస్య, ఆరోగ్య సమస్యలు లేకుండా చూశారని చెప్పారు. ప్రజా సమస్యలను తన సమస్యగా భావించి వారి సమస్యను వెంటనే పరిష్కరించిన మహనీయుడు నర్రా రాఘవరెడ్డి అని కొనియాడారు. నర్రా రాఘవరెడ్డి పేరుతో షుగర్, బీపీ, ఫిట్స్, పక్షవాతం రోగులకు మందులు ఇస్తున్నామని చెప్పారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వర్ధంతి సభకు పుచ్చకాయల నర్సిరెడ్డి అధ్యక్షత వహించగా సీపీఎం జిల్లా నాయకులు బండా శ్రీశైలం, గంజి మురళీధర్, ఎండీ.సలీం, ఊట్కూరు నారాయణరెడ్డి, దండంపల్లి సత్తయ్య, నలుపరాజు సైదులు, అనురాధ, తుమ్మల పద్మ, పరిపూర్ణ చారి, కోట్ల అశోక్ రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, నరేశ్, బొల్లు వసంతకుమార్, రవి, లింగయ్య, సైదాచారి, సత్యనారాయణ పాల్గొన్నారు.