దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న 24 గంటల సరఫరాను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నది. రైతులు సుభిక్షంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నది. అందుకే రైతులకు 3 గంటల కరెంట్ చాలని ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా వాగుతున్నారు. అంతటితో ఆగకుండా రైతులు 10హెచ్‌పీ మోటర్లు కొనుక్కుంటే సరిపోతుందని ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీనిపై రైతులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సంతోషంగా ఉన్న అన్నదాతను ఆగం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, 3 గంటల కరెంట్‌తో మూల కూడా తడవదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నాశనం కోరుకునే
కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని, ఓట్ల కోసం వస్తే ఉరికించి కొడతామని దుమ్మెత్తిపోస్తున్నారు.
గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్కి 60 మోటర్లు ఉండేవి. ప్రస్తుతం 10 మోటర్లకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో నాణ్యమైన విద్యుత్ సైప్లె అవుతుంది. అందుకే ప్రస్తుతం మోటర్లు కరాబ్ అవుతలేవు . మెకానికులకు గిరాకీ తగ్గింది. నాకు మోటర్లు వెలికి తీసే ట్రాక్టర్ ఉన్నది. ప్రస్తుతం కొత్త బోర్లు వేసిన వారికి మోటర్లు ఫిట్ చేయడం తప్ప పాత బోర్లు రిపేర్‌కు అంతగా వస్తలేవు. అప్పట్లో లో ఓల్టేజీ సమస్య చాలా ఉండేది. ప్రస్తుతం సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు పెరగడంతో ఎలాంటి సమస్య లేదు. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు 3గంటల కరెంట్ ఇస్తే అరకొర కరెంట్‌తో ప్రజలు ఇబ్బంది పడుతరు. 24 గంటల కరెంట్ సరఫరాతో రైతు ఇష్టమున్నప్పుడు మోటర్ పెట్టుకుంటుండు. అప్పుడు తనకు అవసరమైన విద్యుత్ వాడుకుంటుండు. ప్రస్తుతం రైతులు సంతోషంగా ఉంటున్నరు.
– చాంద్‌పాష, మోటార్ మెకానిక్, చండూరు
కాంగ్రెసోళ్లు చెప్పే 3గంటల కరెంట్‌తో రైతులకు తిప్పలు తప్పవు. తెలంగాణ వచ్చాక మా లాంటి చిన్నకారు రైతులు 24 గంటల కరెంటుతో వ్యవసాయం చేసి మంచిగ బతుకుతున్నం. తెలంగాణ రాక ముందు ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. గతంలో వచ్చిపోయే కరెంట్‌తో ఎన్నో సార్లు కరెంటు మోటర్లు కాలిపోయాయి. సీఎం కేసీఆర్ సార్ 24గంటల కరెంట్, రైతుబంధు, బీమా ఇచ్చి రైతులను ఆదుకున్నడు. 3గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెసోళ్లకు ఓటు వేస్తే రైతుల బతుకులు ఆగమవుతయి. 3గంటల కరెంటు వ్యవసాయానికి ఏమాత్రం సరిపోదు. మాకు 24గంటల కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి. రైతులమంతా సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటాం.
– వరికుప్పల పాపయ్య, కల్మెర(గ్రా), కట్టంగూర్
నేను 30యేండ్లుగా వ్యవసాయం చేస్తున్నా. పదేండ్ల క్రితం వ్యవసాయానికి సరిపడ కరెంట్ లేదు. లో ఓల్టేజీ కరెంట్‌తో మోటర్లు కాలిపోయి పంటలు ఎండిపోయాయి. పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలై నానా ఇబ్బందులుపడ్డాం. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ పుణ్యమా అని నిరంతరం కరెంట్ వస్తుంది. సాగునీటి కష్టాలు తప్పి ఇప్పుడిప్పుడే మా జీవితాల్లో వెలుగు నిండుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి 10హెచ్‌పీ మోటారు పెట్టుకుంటే వ్యవసాయానికి 3గంటల కరంట్ చాలంటుండు.
రేవంత్‌రెడ్డిని నమ్ముకుంటే రైతులు మూడు చర్ల నీళ్లు తాగాలి. 5హెచ్‌పీ మోటార్ పెడితే ఎకరం పొలం పారేందుకు 5గంటలు పడుతుంది. నీరు కూడా భూమిలోకి ఇంకడం వల్ల పంటలు బతుకుతాయి. అదే 10హెచ్‌పీ మోటర్ పెడితే బావులు, బోర్లలో నీరు తొందరగా అయిపోయి పంటలు ఎండిపోతాయి. 10 హెచ్‌పీ మోటర్లు వాడితే 200కేవీ ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉంటుంది. సుమారు 8యూనిట్ల కరెంట్ కాలుతుంది. 3గంటల కరెంట్, 10హెచ్‌పీ మోటర్తో రైతులు వ్యవసాయం చేసుకోలేక మూట ముల్లె సర్దుకుని దేశాలు పట్టుకొని పోవాలి. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ సార్కే మా మద్దతు.
– పోలేపల్లి నారాయణరెడ్డి, రాయినిపాలెం, మిర్యాలగూడ రూరల్
కాంగ్రెసోళ్లు చెబుతున్న 3గంటల కరెంట్‌తో పొలం పారదు. గతంలో కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియకపోయేది. కరెంట్ కోసం పొలం కాడికి పోవాలంటే ఎన్నో కష్టాలు పడ్డాం. ప్రస్తుతం తెలంగాణ సర్కార్ రైతులకు 24గంటల కరెంట్ ఇచ్చాక మా బాధలు తీరినయ్. సీఎం కేసీఆర్ సార్ దయతో ప్రస్తుతం కరెంట్ పోకుండా ఉండడంతో మంచిగా పంటలు పండించుకుని అమ్ముకుంటున్నం. కాంగ్రెస్ రైతులను ఆగం చేయాలని చూస్తున్నది. 3గంటల కరెంటు సరిపోక ఇబ్బందులు పడుతం. కాంగ్రెస్ ఇస్తామంటున్న 3గంటల కరెంటు వద్దు, మాకు సీఎం కేసీఆర్ ఇచ్చే 24కరెంటే మంచిగుంటది. రైతులంతా సీఎం కేసీఆర్ సార్‌కు ఓటేసి అండగా ఉంటాం.
– జంజిరాల ఎల్లయ్య, కల్మెర(గ్రా), కట్టంగూర్
కాంగ్రెస్ పాలనలో పంటకు నీళ్లు పెట్టేందుకు కరెంటు ఎప్పుడొస్తుందో తెలియక అరిగోసపడ్డం. పంటను కాపాడుకునేందుకు ఎన్ని ఆపసోపాలు పడ్డామో మాకు తెలుసు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రభుత్వం 24గంటల కరెంట్ ఇవ్వడం నయమైంది.. రెండు పంటలకు సరిపడా నీరు అందుతుంది. రైతుల బాధ తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ 24గంటల కరెంట్ ఇస్తుండు. కాంగ్రెసోళ్లు 3గంటల కరెంట్ చాలంటే ఏడంగ పంటలు పండుతయి. రైతుల ఆగం కావాల్నా. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమంటున్నరు.. ఏడంగ తెచ్చేది.. కాంగ్రెసోళ్లు మళ్లీ రైతులను ఇబ్బంది పెట్టడం కాకపోతే ఇంకేంటి. రైతులు బీఆర్ఎస్కే బరాబర్ మద్దతుగా నిలుస్తరు.
– శ్రీనివాస్‌రెడ్డి, గాగిళ్లపురం(గ్రా), చందంపేట( మం)
రాష్ట్రంలో పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలపై కాంగ్రెసోళ్ల కండ్లు పడి నిప్పులు పోసి ఆగం చేసేందుకు కుట్రలు చేస్తున్నరు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 3గంటల కరెంటే చాలు పొలం మొత్తం పారుతదని అంటుండు. ఆయనకు వ్యవసాయం గురించి తెల్వదు కాబట్టే ఇష్టమొచ్చినట్లు వాగుతున్నడు. 3గంటల కరెంట్‌తో కనీసం పది గుంటలైనా తడువదు. అట్లాంటప్పుడు ఐదెకరాలు ఎలా పారుతది. మల్లా 10హెచ్‌పీ మోటార్ వాడాలంటడు. రైతులెవరూ 10హెచ్‌పీ మోటర్లు వాడరు మహా అంటే 3హెచ్‌పీ లేకపోతే 5హెచ్‌పీ వాడుతరు. 10హెచ్‌పీ మోటర్ కొనాలంటే సామాన్ల తోటి లక్ష రూపాయలు అయితది మరి రేవంత్‌రెడ్డి కొనిస్తడా. ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ అధికారంలోకొచ్చాక రైతుల గొంతు కొయ్యాలని చూస్తున్నడు. ఎవరు మంచి చేస్తరనేది ప్రజలందరికి తెలుసు. సీఎం కేసీఆర్ సార్ పదేండ్లుగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా కంటికి రెప్పలా కాపాడుతుండు. ఎప్పటికీ మాకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నడు. అట్లాంటిది మేము సీఎం కేసీఆర్ వైపు గాక కాంగ్రెస్ వైపు ఎలా ఉంటాం. కాంగ్రెసోళ్లు మల్లా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే రైతులందరూ ఏకమై బుద్ధి చెప్తాం.
– రంగా, చాంప్లతండా(గ్రా), అడవిదేవులపల్లి
కాంగ్రెసోళ్లు చెబుతున్నట్లు 3గంటల కరెంటిస్తే ఎకరం భూమి సాగు చేయలేం. బీఆర్ఎస్ ప్రభుత్వం 24గంటల ఉచిత కరెంట్ ఇస్తుండడంతో రైతుల కష్టాలు తీరాయి. ఇప్పుడిప్పుడే రైతులు మూడు పూటలా తింటున్నారు. రైతులు సంతోషంగా ఉండడం కాంగ్రెస్‌కు ఇష్టం లేనట్లుంది. 10హెచ్‌పీ మోటార్లు వాడే పరిస్థితి రైతులకు లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులను నమ్మించి గొంతుకోసే ప్రయత్నం చేస్తున్నది. అన్నింటిని గమనిస్తున్న రైతులు బీఆర్ఎస్ పక్షానే ఉండి కాంగ్రెస్‌కు ఓటుతోనే సమాధానం చెబుతారు.
– పోలె లింగయ్య, రైతు, గుడిపల్లి
కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు వ్యవసాయానికి 3గంటల కరెంట్ సరఫరా సరిపోదు. ఇక్కడ రైతులెవరూ 3హెచ్‌పీ, 5హెచ్‌పీ తప్ప 10హెచ్‌పీ మోటర్లు వాడుతలేరు. 10 హెచ్‌పీ మోటార్లు వాడితే లో ఓల్టేజీ సమస్యలు వస్తయి. రైతులందరూ ఒకేసారి 10 హెచ్‌పీ మోటార్లు వాడితే ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్లు పనిచేయవు. నిత్యం కరెంట్ సమస్యలతో పాటు రైతులకు మోటర్ మరమ్మతు ఖర్చులు భారమవుతయి. ప్రస్తుతం ఇస్తున్నట్లు 24గంటల కరెంట్ ఇస్తేనే సరిపోతుంది. 10హెచ్‌పీ మోటర్లు పెట్టి 3గంటల కరెంట్‌తో వ్యవసాయం చాలా కష్టం. 3గంటల కరెంట్ సరిపోతుందని చెబుతున్న రేవంత్‌రెడ్డికి వ్యవసాయం గురించి తెలియనట్లుంది. వ్యసాయం గురించి తెలవనోళ్లు గిట్లనే అడ్డం దొడ్డం మాట్లాడుతారు. రైతులందరూ 24గంటల కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్ మద్దతిస్తాం.
– కటికం శ్రీనివాస్‌రెడ్డి, జువ్విగూడెం(గ్రా), నార్కట్‌పల్లి