– దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్
దేవరకొండ, జూలై 07 : సర్ ప్రక్రియలో బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడి ఓటును కాపాడాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం చందంపేట, నేరేడుగొమ్ము మండలాల కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో నిర్వహించిన SIR (Special Intensive Revision) విధానంపై అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రతి బూత్‌లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా పని చేయాలని సూచించారు. ప్రజలకు ఓటు కల్పించి వారి హక్కులను, ప్రభుత్వ పథకాలను అందేలా చూడాల్సిన బాధ్యత బిఎల్ఏలదే అన్నారు.
SIR ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా నింపించి, నిర్ణీత గడువులోపు ఆన్లైన్లో నమోదు చేయించాలని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన వారందరి పేర్లు ఓటరు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, నల్లగొండ పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, దేవరకొండ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవింద్ యాదవ్, చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, నేరేడుగొమ్ము మండల అధ్యక్షుడు వాంకునావత్ బిక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.