మునుగోడు, మార్చి 20 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువకులు, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ-డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 94వ వర్ధంతిని పురస్కరించుకుని సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో విద్యార్థులు, యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారన్నారు. వీటివల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, సమాజంలో చీడపురుగులుగా తయారవుతున్నారన్నారు.
భారత స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ 23 ఏళ్ల వయస్సులో ప్రాణాలను సైతం వదిలిపెట్టాడని, అతను కలగన్న నవ సమాజ నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి, యువత కృషి చేయాలని కోరారు. ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి, డ్రగ్స్ ఇప్పుడు మునుగోడు ప్రాంతంలోకి చొచ్చుకొచ్చినట్లు చెప్పారు. సమాజ శ్రేయస్సు దృష్ట్యా పోలీసువారికి విద్యార్థులుగా, యువకులుగా మనమంతా సహకరించాలన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతంలో గాని, గ్రామంలో గాని గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడినట్టు తెలిసిన, సరఫరా చేస్తున్నట్టు తెలిసినా డయల్ 100కి, స్థానిక పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలన్నారు.
అలాగే ఇటీవల కాలంలో కొంతమంది యువత, విద్యార్థులే లక్ష్యంగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారని, వీటి వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని, పలువురు యువకులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించాలని, అమాయక ప్రజల దగ్గర కాజేసిన సొమ్మును రికవరీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుపల్లి నరేశ్, యసరని వంశీకృష్ణ, మండల సహాయ కార్యదర్శి యాట శ్రీకాంత్, చెనగోని గణేశ్, ఎస్ఎఫ్ఐ నాయకులు మధు, మధుకర్, భాను ప్రకాశ్, శశి, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.