కట్టంగూర్, జనవరి 07 : విద్యార్థినులు క్రమశిక్షణ, ప్రణాళికయుతంగా చదివి పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ మండల ప్రత్యేక అధికారి సతీశ్ అన్నారు. బుధవారం కట్టంగూర్ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించి పదో తరగతి విద్యార్థినులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులతో పాటు పరిసరాలు, భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విలువైన సమయాన్ని వృథా చేయొద్దన్నారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రతలు పాటించాలన్నారు. సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని విజయానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలన్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి అంటటి అంజయ్య, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ చింతమల్ల చలపతి, పాఠశాల ప్రత్యేక అధికారి నీలాంబరి, ఉపాధ్యాయులు ఉన్నారు.