నందికొండ, ఆగస్టు 15 : శ్రీశైలం నుంచి 95,578 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాతుండడంతో నాగార్జునసాగర్ డ్యామ్ 6 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని విడుదల చేశారు. సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది. బుధవారం డ్యామ్ 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించగా శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో గురువారం గేట్ల సంఖ్యను 6కు పెంచారు. సాయంత్రం ఇన్‌ఫ్లో తగ్గడంతో 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎడమ కాల్వ ద్వారా 7,518 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8,023, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,948, వరద కాల్వ ద్వారా 600, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నది. సాగర్ మొత్తం 63,089 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అదే స్థాయిలో అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో మరికొన్ని రోజులు డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగే అవకాశం ఉందని ఎన్నెస్పీ అధికారులు చెబుతున్నారు.
చౌటుప్పల రూరల్, ఆగస్టు 15 : వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్‌లో ఉంటున్న ప్రజలు పల్లె బాట పట్టారు. ఈ నెల 15న పంద్రాగస్టు, 16న వరలక్ష్మి వ్రతం, 18న ఆదివారం, 19న రాఖీ పౌర్ణమి ఉండడంతో ఉద్యోగులు, వి ద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. దాంతో 65వ జాతీయ రహదారి విజయవాడ వైపు వచ్చే వాహనాలతో రద్దీగా మారింది. చౌటుప్పల మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద గురువారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వాహనాల రాక కనిపించింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.