నల్లగొండ, నవంబర్ 5 : మత్స్యకారులకు చేయూతనందిచాల్సిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి కాంట్రాక్టర్లు ఆదిలోనే తూట్లు పొడుతున్నారు. నిబంధనల ప్రకారం పదించుల వరకు సైజ్ ఉన్న చేప పిల్లలనను చెరువుల్లో పోయాల్సి ఉండగా, మూడించులు ఉన్న పిల్లలనే తీసుకు వస్తున్నారు. చెరువుల్లో వదిలిన అనంతరం పది ఇంచుల చేప పిల్లలు పోసినట్లు అధికారుల ద్వారా రికార్డుల్లో రాయించుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో 2.98 కోట్ల చేప పిల్లలు పోయాల్సి ఉండగా, అందులో 2.05 కోట్లు 80 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు, 93 లక్షల పిల్లలు 30 మి.మీ. నుంచి 40 మి.మీ. ఉండాలి. క్షేత్రస్థాయిలో మాత్రం మొత్తం 30 నుంచి 40 మిల్లీమీటర్ల చేప పిల్లలనే పోస్తూ 80 నుంచి 100 మిల్లీమీటర్ల పొడవు ఉన్న చేప పిల్లలను పోస్తున్నట్లు మాయ చేస్తున్నారు.
30 మి.మీ. నుంచి 40 మి.మీ. చేప పిల్లకు ప్రభుత్వం 55 చెల్లిస్తున్నది. 80- 100 మి.మీ. చేప పిల్లకు రూ.1.47 ఇస్తుంది. జిల్లాలో మొత్తం 2.98 కోట్ల చేప పిల్లల్లో చిన్న సైజ్ చేప పిల్లలకు రూ.51.15 లక్షలు, పెద్ద సైజ్ చేప పిల్లలకు రూ.3.01కోట్లు కలిపి మొత్తం రూ.3.52 కోట్లు ఖర్చు చేస్తుంది. కాంట్రాక్టర్లు పెద్ద సైజ్ చేప పిల్లలు తీసుకొచ్చి చెరువుల్లో పోయకుండా చిన్న పిల్లలనే పోసి మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. పెద్ద చేప పిల్లల పేరుతో డబ్బును అక్రమంగా దండుకునే ప్రయత్నం చేస్తున్నారు.
చేప పిల్లల విడుదలలో కాంట్రాక్టర్లు, మత్స్యశాఖ అధికారుల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. జిల్లాలో ఈ ఏడాది చేప పిల్లల సరఫరాకు టెండర్లు పిలవగా నలుగురు అధికార పార్టీ కాంట్రాక్టర్లే టెండర్ వేశారు. వారికి ఫిష్ సీడ్ ఫామ్స్ లేవని రెండు సార్లు రద్దు చేయగా, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి వారికే కాంట్రాక్ట్ ఫైనల్ చేయించుకున్నారు. చేప పిల్లలను కైకలూరు నుంచి తీసుకురావడంతోపాటు పిల్లల సైజ్ విషయంలో నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని మత్స్య శాఖ యంత్రాంగం ప్రస్తావించినా నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజక వర్గాలకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు పెడ చెవిన పెడుతున్నారని తెలిసింది. ‘ఏదైనా ఇబ్బంది వస్తే మేం చూసుకుంటాం’ అంటూ బుకాయిస్తున్నారని తెలిసింది.
చెరువుల్లో చేప పిల్లలను పోయడానికి ముందు చెరువు వద్ద మత్స్యకారుల సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో కాంటా వేయాలి. కాంట్రాక్టర్ తరఫున వచ్చేవాళ్లు కాంటా వేయకుండానే చెరువుల్లో వదులుతున్నారని తెలుస్తున్నది. కొన్ని చెరువుల వద్ద అధ్యక్షుడిని మేనేజ్ చేసి పోస్తుండగా, మరికొన్ని చెరువుల వద్ద సొసైటీ సభ్యులు లెక్క ప్రకారం పోయాలని పట్టుపట్టడంతో తప్పని పరిస్దితలు ఎదురవుతున్నాయి. మంగళవారం తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం, నల్లగొండ మండలంలోని అప్పాజిపేట, దోమలపల్లి గ్రామాల్లో నాలుగున్నర లక్షల చేప పిల్లలు పోయాలని అధికారులు సూచించగా కాంట్రాక్టర్ మాత్రం మూడు లక్షల పిల్లలే తీసుకొచ్చాడు. ఆయా చెరువుల వద్ద మత్స్యకారులు లెక్క ప్రకారం పోయాలని పట్టుబట్టడంతో విషయం రేపు పోస్తామని మాట దాటేశాడు. మరోవైపు ప్రతి పది కేజీల చేప పిల్లల్లో కనీసం మూడు నుంచి నాలుగు వరకు పావు కేజీ సైజ్ ఉన్న చేప పిల్లలు రావడంతో మత్స్యకారులు నష్టపోతున్నారు.