ఆత్మకూరు.ఎస్, మార్చి 15 : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం శెట్టిగూడెం గ్రామానికి చెందిన రైతు బీరెల్లి రామిరెడ్డి ఐదు ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోట సాగు చేస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా తోటకు నీళ్లు పుష్కలంగా అందేవి. మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఎక్కడ చూసినా నీళ్లు పుష్కలంగా ఉండేవి. ఏ కుంట, చెరువు చూసినా జలకళే. ఇప్పుడు కనీసం యాసంగి పంటకు నీళ్లు లేక రైతులు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో తోట నీటి కొరతను ఎదుర్కొంటుంది. దాంతో రైతు రామిరెడ్డి పొలంలో దాదాపు 6 బోర్లు వేశాడు. అయినా ఏ ఒక్క దానిలో కూడా చుక్క నీరు పడలేదు.
నీటి కొరతతో తోట వాడుముఖం పడుతుండడంతో తట్టుకోలేని రైతు ట్యాంకర్ ద్వారా తోటకు నీటి సరఫరా చేస్తూ మొక్కలను బ్రతికించుకుంటున్నాడు. రోజుకి మూడు ట్యాంకర్ల చొప్పున తోటకు నీళ్లందిస్తున్నాడు. ఒక్క రోజుకు రూ. 3 వేలు ఖర్చు అవుతున్నట్లు రైతు తెలిపాడు. ఇలా అప్పులు చేసి తోటను ఎన్ని రోజులు కాపాడుకోవాలో తెలియడం లేదని రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి సాగు నీళ్లు వదిలి అన్నదాతను ఆదుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
Oil Palm : ఆయిల్‌పామ్ తోటకు నీటి కొరత.. ట్యాంకర్ల ద్వారా సరఫరా