నందికొండ, జూలై 8 : శ్రీశైలం జలాశయం నుంచి నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి మంగళవారం వరద నీటిని విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్ దిశగా కృష్ణా జలాలు బిరబిరా పరుగులు పెడుతున్నాయి. ఈ నీరు సుమారు 85 కిలో మీటర్ల దూరంలో ఉన్న నాగార్జున సాగర్‌కు వచ్చి చేరుతుండటంతో రిజర్వాయర్ జలకళను సంతరించుకుంటోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 194206 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గాను 882.00 (198.81 టీఎంసీల) అడుగుల గరిష్ట స్థాయికి చేరడంతో వరద నీటి ఉధృతిని తగ్గించేందుకు డ్యాం అధికారులు 4 క్రస్టు గేట్లను ఎత్తి 194641 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్‌లోకి విడుదల చేశారు. సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 590 (312 టీఎంసీలు) అడుగులకు గాను ప్రస్తుతం 170.8928 టీఎంసీల ( 531.40 అడుగుల వద్ద) నీరు నిల్వ ఉంది. గత ఏడాది జూలై 30న శ్రీశైలం డ్యాం క్రస్టు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా అప్పడు సాగర్ డ్యాంలో 516.30 (142.6157టీఎంసీ) వద్ద నీరు నిల్వ ఉంది.
ప్రస్తుతం గతేడాది కంటే 22 రోజుల ముందుగానే శ్రీశైలం క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు. సాగర్ రిజర్వాయర్‌లో గతేడాది కంటే ఈ ఏడాది 15 అడుగుల మేర అధికంగా ఉన్నందున ఈ ఏడాది సాగర్ డ్యాం క్రస్టు గేట్ల ద్వారా నీటి విడుదల మందుగానే ఉంటుందని ఎన్ఎస్పీ అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యాం ఎడమకాల్వ ద్వారా 3090 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుం ది. సాగర్ రిజర్వాయర్‌లో 59,368 క్యూస్కెల ఇన్‌ఫ్లో ఉంది. సాగర్ రిజర్వాయర్‌లో వరద ఉధృతి కొనసాగుతున్నందున ఎడమ కాల్వ ఆయకట్టు భూముల కు ముందుగానే నీటి విడుదల ఉంటుందని అన్న దాతలు ఆశిస్తున్నారు.