మిర్యాలగూడ, ఆగస్టు 24 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నీటి విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదికి వరద పోటెత్తడంతో సాగర్ జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ నెల రెండునే ఎడమ క్వాలకు నీటి విడుదలను ప్రారంభించారు. సాధారణంగా నీటి విడుదల చేసిన వారంలోపే షెడ్యూల్‌ను ప్రకటిస్తుంటారు. సీజన్ మొత్తంగా పంటల సాగుకు ఎన్ని టీఎంసీల నీటని కేటాయిస్తారనేది పేర్కొంటారు. విడుదల నిరంతరాయంగా ఉంటుందా, వారబందీలో ఇస్తారా, ఇస్తే ఏ రోజుల్లో ఇచ్చి.. ఏయే రోజుల్లో బంద్ పెడుతారు అనే దానిపై స్పష్టత ఉంటే సాగుకు సన్నద్ధం అవుతారు. నీటి విడుదల సమయం తక్కువగా ఉంటే స్వల్పకాలిక వరి వంగడాలను నాటు వేసుకుంటారు. ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక వరి వంగడాలకు వెళ్తారు. కానీ, మూడు వారాలు దాటినా షెడ్యూల్ ప్రకటించకపోవడం గందరగోళానికి దారి తీస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో ఎడమ కాల్వకు 18 సార్లు నీటి విడుదల చేసింది. 9 రోజుల పాటు నీళ్లు ఇస్తూ.. ఆరు రోజుల పాటు బంద్ పెడుతూ.. ప్రణాళికాబద్ధంగా చివరి భూములకు సైతం నీరు అందించి పంటలు ఎండకుండా చూసింది.
మేజర్ కాల్వల చివరికి చేరని సాగునీరు
సాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 51 మేజర్లు ఉండగా 3,03,353 ఎకరాల ఆయకట్టు సాగు అవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి విడుదలకు ముందే మేజర్ల పరిధిలోని కాల్వలను పూడిక తీయించడంతోపాటు కట్టలపై కంపచెట్లు తొలగించేవారు. ప్రస్తుతం కాల్వలకు మరమ్మతులు చేయకపోవడంతో చివరి భూములకు సాగునీరు అందడం లేదు. నీళ్లు వదిలి 22 రోజులు దాటినా చివరి భూములకు చుక్క నీరు చేరలేదు. దాంతో పలుచోట్ల రైతులే సొంత ఖర్చులతో జేసీబీలు పెట్టి కాల్వలను శుభ్రం చేసుకుంటున్నారు. కాని నీటి విడుదల పూర్తిస్తాయిలో లేకపోవడం వల్ల చివరి భూములకు నీరందడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎన్నెస్పీ అధికారుల పర్యవేక్షణ లోపం రైతులకు శాపంగా మారింది. ఇప్పటికైనా స్పందించి మేజర్లకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడంతోపాటు స్వల్ప మరమ్మతులు అయినా చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగర్ ఆయకట్టు ప్రాంతానికి చెందినవారే అయినా ఇంతవరకు నీటి విడుదల షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించాలి
ఎడమ కాల్వకు నీళ్లు విడుదల చేసి మూడు వారాలు దాటింది. ఇప్పటికీ ప్రభుత్వం ఎన్ని రోజులు నీళ్లు ఇస్తుందో చెప్పలేదు. నీటి విడుదల తేదీలను ప్రకటిస్తే ఏ రకం వరి నాటు పెట్టుకోవాలో అర్ధమవుతుంది. ప్రభుత్వం ఇప్పటివరకు షెడ్యూల్ ప్రటించకపోవడంతో అయోమయంలో ఉన్నాం. ఇప్పటివరకు కాల్వ చివరి భూములకు నీళ్లే తాకలేదు. కాల్వల నిండా కంపచెట్లు పెరిగి నీరు సాఫీగా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం మరమ్మతులు చేయించకపోవడంతో రైతులమే తలా ఇన్ని డబ్బులు వేసుకొని పొక్లేన్తో పూడిక తీసుంచుకున్నాం. మేజర్ కాల్వలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి చివరి భూములకు అందిస్తేనే వరి నాట్లు వేసుకుంటాం. ఎన్నెస్పీ అధికారులు కాల్వల వెంట తిరిగి చివరి వరకు నీళ్లు అందేలా చూడాలి.
– జానునాయక్, రైతు గూడూరు, మిర్యాలగూడ
ప్రభుత్వం స్పందించకపోతే నష్టపోతాం
ముదిమాణిక్యం మేజర్ పరిధిలో కాల్వలు అధ్వానంగా ఉన్నాయి. పూర్తిగా కంప చెట్లు అల్లుకుపోయాయి. కట్టలపై మనుషులు కూడా నడిచే పరిస్థితి లేదు. మెట్ట పంటలకైనా నీరు వస్తుందని ఎదురుచూస్తున్నాం. అధికారులు కాల్వలను శుభ్రం చేయించి కంపచెట్లు తీయిస్తే మాకు నీళ్లు అందుతాయి. లేదంటే రైతులం తీవ్రంగా నష్టపోతాం.
-పొర్లు పెద్ద మల్లయ్య (అడవిదేవులపల్లి)
చివరి భూములకు నీళ్లు వచ్చేట్లు చూడాలి
సాగర్ కాల్వకు నీళ్లిచ్చినా కిష్టాపురం మేజర్ చివరికి ఇంతవరకు నీళ్లు రాలేదు. కాల్వ మొత్తం పూడికతో నిండింది. కంప చెట్లు అంతెత్తు పెరిగినయి. నారుమడ్లు తడుపుకోవడమే కష్టంగా మారింది. కాల్వలో పూడిక తీయిం చి కంప చెట్లు తొలగిస్తేనే చివరి భూములకు నీరు అందుతుంది. కాల్వల ముందు భాగంలో నీటి వృధాను అరికట్టి చివరి భూములకు నీళ్లు వచ్చేట్లు చూడాలి. ఎడమ కాల్వకు నీళ్లు ఎప్పటి వరకు ఇస్తారో కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి.
-ధర్మానాయక్, బోట్యానాయక్తండా, మిర్యాలగూడ