నందికొండ, సెప్టెంబర్ 13 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 2,60,844 క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వచ్చి చేరుతుండడం, నాగార్జునసాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 2,09,508 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతున్న ఇన్‌ఫ్లో ఆధారంగా డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను చేపడుతామని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 ( 312.0450 టీఎంసీలు) అడుగులకుగాను 589.60 (310.8498 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ఎడమ కాల్వ ద్వారా 6,325 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 9,019 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33,292 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సమానంగా కొనసాగుతోంది.