నందికొండ, సెప్టెంబర్ 3 : నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీకేజీ అవుతుంది. ఈ సీజన్లో జూలై 29 నుంచి క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ప్రారంభించి సెప్టెంబర్ 2న నీటి విడుదలను నిలుపుదల చేశారు. నీటిని నిలుపుదల చేసినా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి లీకేజ్‌లు కొనసాగుతున్నాయి. 1,6,9,15,25 గేట్ల నుంచి తక్కవ మోతాదులో లీకేజ్‌లు కొనసాగుతుండగా, 26వ గేట్ రబ్బర్ సీల్ వెంబండి భారీ స్థాయిలో నీరు లీకేజి అవుతోంది. ప్రతి ఏడాది డ్యాం మరమ్మతులకు రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేదని, నాసిరకం పనులతో క్రస్ట్ గేట్ల నుంచి లీకేజీలు కొనసాగుతున్నాయని రిటైర్డు ఇంజినీర్లు పేర్కొంటున్నారు. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం లోపం, అనుభవం ఉన్న ఉద్యోగులు రిటైర్డు కావడం, ఉన్న ఉద్యోగులకు పనిలో అనుభవం లేకపోవడంతో డ్యాం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని సిబ్బంది తెలిపారు.
సాగర్ పూర్తిస్థాయిలో నిండడంతో రెండు పంటలకు నీరు అందుతుందన్న సంతోషంలో ఉన్న రైతులకు క్రస్ట్ గేట్ల నుంచి లీకేజీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది పుష్కలంగా నీరు డ్యాంలో చేరినా లీకేజీలతో నీరు వృథాగా పోతుండడంతో రెండు పంటలకు నీరు అందుతుందో, లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్‌కు శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో నీటి విడుదలను మంగళవారం రాత్రి నిలిపివేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గానూ 586.00 అడుగులకు చేరుకొని 300.3200 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమకాల్వ ద్వారా 5,654, కుడికాల్వ ద్వారా 10,000 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, , ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32,886 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 91,309 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా, 51,240 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది.