నల్లగొండ ప్రతినిధి, జనవరి30(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో వెలసిన వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాదు విజయవాడ 65వ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కోవర్ట్ వెంకట్ రెడ్డి అంటూ గుర్తు తెలియని వ్యక్తులు వాల్ పోస్టర్లు అతికించారు. ఈ వాల్ పోస్టర్లలో 13 అంశాలతో కూడిన ప్రశ్నలను సంధించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన డిజిటల్ సభ్యత్వం ఉన్నదా అంటూ ప్రశ్నిస్తూ సొంత గ్రామంలో సర్పంచ్, ఎంపిటిసి లను గెలిపించుకోలేని అసమర్థుడు అని పేర్కొన్నారు. సొంత సొదరున్ని నార్కట్ పల్లి లో జెడ్పీటీసీ గా ఎందుకు గెలిపించుకోలేదని, నకిరేకల్ మున్సిపాలిటీలో రెండు కౌన్సిలర్ల ను కూడా గెలిపించలేక్ పోయాడని విమర్శించారు. సొంత సోదరుని గెలిపించుకోలేని వెంకట్ రెడ్డి ఎలా స్టార్ట్ క్యాంపెయినర్ అవుతాడని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపికి మద్దతు ఇవ్వడంతో పాటు మద్దతు ఇచ్చిన నకిరేకల్ నియోజకవర్గనికి చెందిన మండల పార్టీ అధ్యక్షులను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పలు అంశాల్లో వెంకట్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తూ పోస్టర్లు వేశారు. అయితే ఈ పోస్టర్లు ఎవరూ వేశారన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.