– ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి
– బీఆర్ఎస్ గెలుపుతోనే మిర్యాలగూడ పట్టణాభివృద్ధి
– మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ, ఫిబ్రవరి 09 : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో మిత్రపక్షాల (బీఆర్ఎస్, సీపీఎం) అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ వారు విస్తృత ప్రచారం చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ అలవికాని హామీలను గుప్పించి ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి అనేక హామీలను తుంగలో తొక్కిందన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయాలని వారు పిలుపునిచ్చారు. ఓటు కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డు చూపించి నిలదీసి అడగాలన్నారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ పట్టణం అన్ని రకాలుగా అభివృద్ది చెందిందని, వందల కోట్ల నిధులను తీసుకొచ్చి పట్టణంలో నెలకొన్న సమస్యలను తొలగించి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కాని రెండేండ్ల కాంగ్రెస్ హయాంలో ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదని, పట్టణంలో అభివృద్ధికి నోచుకోక 20 ఏండ్లు వెనక్కి పోయిందన్నారు. కాంగ్రెస్ పట్ల పట్టణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావని చెబుతున్నారని, ఇవేమైనా వారి అబ్బ జాగీరా? ఓటేస్తేనే మున్సిపాలిటీలకు నిధులు ఇస్తామని బ్లాక్మెయిల్ చేయడం రేవంత్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమన్నారు. మున్సిపాలిటీలకు నిధులు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుండి జనాభా ప్రాతిపదికన వస్తాయని, అవి ఎవరి దయదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండవన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి 12 గంటలే ఇస్తున్నట్లు తెలిపారు. రైతులను మళ్లీ యూరియా బస్తాల కోసం క్యూలైన్లో నిలబెట్టిన ఘనత రేవంత్ రెడ్డిదేనన్నారు. ఫిబ్రవరి వచ్చినా యాసంగి రైతు బంధు పడలేదని, ఇప్పటికే రెండు రైతుబంధులను ఎగ్గొట్టి రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు కానీ బూతులు మాత్రం బాగా వచ్చన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి నాణ్యమైన విద్యను అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇమామలు, మౌజాంలకు నెలనెలా గౌరవ వేతనం ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్ అన్నారు. పేద ముస్లీంలు పండుగ జరుపుకోవాలని రంజాన్ తోఫా ఇస్తే రేవంత్ రెడ్డి దాన్ని బంద్ పెట్టాడన్నారు. ఈ 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని వారు ఓటర్లను అభ్యర్ధించారు. మిర్యాలగూడ నియోజకవర్గం శరవేగవంతో అభివృద్ధి చెందాలంటే కారు గుర్తు గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.