కట్టంగూర్, ఆగస్టు 28 : స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితా లోపాలను వెంటనే గుర్తించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన సూచనలు ప్రతి నాయకుడు, కార్యకర్త పాటించాలన్నారు. ఓటరు జాబితాలో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా గ్రామస్థాయి నాయకులు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా జాబితాను గ్రామంలోనే తనిఖీ చేసి ఏవైనా అక్రమాలు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎమ్మెల్సీలు ఎల్.రమణ, దాసోజు శ్రవణ కుమార్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీకి అన్ని హోదాలలో ఉన్న నాయకుల సంపూర్ణ సహకారం కార్యకర్తలకు ఉంటుందని చెప్పారు.
ఓటరు. జాబితా తయారీ రోజు నుంచే ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు క్షుణ్ణంగా పర్యవేక్షించాలన్నారు. ఆగస్టు 31వ తేదీలోగా సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అభ్యంతరాలు నమోదు చేయాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి తుది జాబితాలో బీఆర్ఎస్ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా తిరిగి చేర్చేలా కృషి చేసే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజాసామ్యంలో ఓటు హక్కు అమూల్యమని, ఆ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేసే అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వారి కుట్రలను తిప్పికొట్టగానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.