చండూరు, జనవరి 23 : ఓటు వజ్రాయుధం లాంటిదని, భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ కమిషనర్ ఎల్.మల్లేశం అన్నారు. శుక్రవారం చండూరు మున్సిపల్ కేంద్రంలో సీనియర్ పాత్రికేయులు రాపోలు ప్రభాకర్, కేశాని శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా రూపొందించిన ఓటర్ అవగాహన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఓటు ఆవశ్యకతను వివరించి, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు విలువను సామాన్యులకు సైతం తెలిపేలా కరపత్రాన్ని రూపొందించిన జర్నలిస్టులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చండూరు సీఐ ఆదిరెడ్డి, ఎంఈఓ సుధాకర్ రెడ్డి, పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, చేనేత పరిరక్షణ సేవా సమితి అధ్యక్షుడు చెరిపల్లి కృష్ణ, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు రాపోలు వెంకన్న, ఏలే శీను, రాపోలు జగదీశ్, కటకం రమేశ్ పాల్గొన్నారు.