– ప్రజలకు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపు
కోదాడ, జనవరి 22 : కోదాడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం కోదాడ పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న కోదాడ పట్టణాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి బాట పట్టించినట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కోదాడ పట్టణంలో తట్టెడు మట్టి కూడా పోయలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి పనులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేగా పద్మావతి రెడ్డిని గెలిపిస్తే ఆమె ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విషయం అందరికి తెలిసిందేనని, ఆమెను కలవాలంటే కాంగ్రెస్ నాయకులకే సమయం దొరకడం లేదని, ఇగ సామాన్య ప్రజలు ఎమ్మెల్యేను కలవాలంటే దళారి వ్యవస్థ ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిని ప్రజలు గమనించాలని కోరారు.
కోదాడ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా గతంలో ఉన్న సిబ్బందితోనే పాలన కొనసాగిందని, తాను ఎమ్మెల్యేగా గెలవగానే అప్పటి జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి పట్టణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో కొత్తగా నియమించిన పారిశుధ్య సిబ్బందిని తొలగించడంతో పట్టణమంతా చెత్తకుప్పలుగా మారి దోమల బెడద, దుర్గంధంతో ప్రజలు నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే, అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను బొల్లం మల్లయ్య యాదవ్ కోరారు.