సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 10 : పర్యావరణ పరిరక్షణకు గణేశ్ నవరాత్రుల్లో మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూచించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై ఆదివారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, భానుపురి ఉత్సవ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. పర్యావరణ హిత గణేశ్ విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మండపాల్లో, ఇండ్లల్లోనూ పర్యావరణ హిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని కోరారు. అనంతరం పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మట్టి గణపతులను నిమజ్జనంతో నీటి కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించేలా ఉత్సవ కమిటీలు చైతన్యం చేయాలని కోరారు. సమావేశంలో ఈ నెల 18న వినాయక చవితి, 27న నిమజ్జన తేదీలుగా నిర్ణయించారు. పీఓపీ విగ్రహాల్లో వాడే రసాయనాలతో నీటితో సహా పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతుందన్నారు. దీని వల్ల అనేక రోగాలు వ్యాప్తి చెందడంతో పాటు నీటిలో జీవించే జలరాసులకు ప్రాణాపాయం పొంచి ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణకు యువతు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. నవరాత్రి ఉత్సవాలకు మెరుగైన ఏర్పాట్లకై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాల అనంతరం నిమజ్జనం చేసేందుకు, మండపాల ఏర్పాట్లకు గాను లైటింగ్, సౌండ్ సిస్టమ్ తదితర వసతులకై ఆయా మండపాల ఉత్సవ కమిటీ బాధ్యులు ముందస్తుగా పోలీస్ వారి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. సద్దుల చెరువులో గణేశ్ నిమజ్జనం ఉంటుందని, అందుకు అనుగుణంగా ఆయా విగ్రహాలను నిమజ్జనానికి తరలించేందుకు ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం, బారీకేడ్లు, ప్లాట్ ఫామ్‌లు, క్రేన్ల ఏర్పాట్లను మున్సిపల్ రెవిన్యూ శాఖల ద్వారా చేపట్టాలన్నారు. అదేవిధంగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఆర్డీఓ బ్రహ్మచారి, డీఎస్పీ నాగభూషణం, భానుపురి ఉత్సవ కమిటీ సభ్యులు చకిలం రాజేశ్వర్‌రావు, రంగినేని రుక్మారావు, బైరు వెంకన్నగౌడ్, అర్జున్‌కుమార్, బైరు విజయ్‌కృష్ణ, దినేశ్, జహీర్, అనంతుల విజయ్, శ్రీనివాస్, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారలు, వివివధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సూర్యాపేట టౌన్, సెప్టెంబర్ 10 : తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరుగని పోరు చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆదివారం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, బానిస సంకెళ్ల విముక్తికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధురాలు ఐలమ్మ అన్నారు. ఆమెతో పాటు ఎందరో మహనీయుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంతర అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆదరణకు నోచుకోని ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహిస్తూ సరైన గౌరవాన్ని కల్పించారన్నారు. రజకుల సౌకర్యార్థం సకల సౌకర్యాలతో మోడ్రన్ దోబీఘాట్లు నిర్మిస్తున్నుట్లు తెలిపారు. ఎంబీసీ కార్పొరేషన్‌తో రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సంజీవ్‌నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జహీర్, వసంత సత్యనారాయణ పిళ్లె పాల్గొన్నారు.