నకిరేకల్, నవంబర్ 10: ప్రశ్నించే గొంతులను పాలకులు అణచివేస్తున్నారని, సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం సరికాదని, పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ, ఏపీ రాష్ర్టాల గౌరవ అధ్యక్షురాలు విమలక్క పిలుపునిచ్చారు. ప్రతిఘటనోద్యమ నిర్మాత, భారత విప్లవోద్యమ అగ్రనేత చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతి సభను అమరవీరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నకిరేకల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విమలక్క మా ట్లాడుతూ మావో ఆలోచనా విధానం వెలుగులో పీడిత ప్రజల విముక్తి కోసం భారత విప్లవోద్యమంలో చండ్ర పుల్లారెడ్డి లాంటి అనేక మంది అమరులయ్యారని గుర్తుచేశారు. దోపిడీ, పీడన, అసమానతలు రద్దుకావాలని కోరా రు. సమస్త ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమని ఎంచుకొని ముందుకు సాగుతున్నామన్నారు.
న్యాయవాది కట్టా భగవంతరెడ్డి మాట్లాడుతూ నేడు రాజ్యహిం స అనేక రూపాల్లో కొనసాగుతోందన్నారు. అమరులను స్మరించుకుంటూ వారిబాటలో నిజాయితీగా ముందుకు సాగడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య మాట్లాడుతూ అడవిలో ఉన్న సంపదను కొల్లగొట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను, మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం హత్య చేయిస్తోందన్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. అంతకుముందు నకిరేకల్‌లో ర్యాలీ నిర్వహించి సభాస్థలికి చేరుకున్నారు. అమరవీరుల స్మారక కమిటీ నేత బొమ్మకంటి కొమరయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో పట్లోళ్ల నాగిరెడ్డి, సదానందం, మల్సూర్, అనిత, పల్లెబోయిన జాని, బెల్లి నాగరాజు, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నా రు.