కాంగ్రెస్ సర్కారులో పాడి రైతులు పరేషాన్ అవుతున్నారు. విజయ డెయిరీ కర్షకులకు పాల బిల్లులు చెల్లించడం లేదు. నెలల తరబడి బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో నాలుగు బిల్లులకు సంబంధించి రూ.కోటికిపైగా పెండింగ్‌లో మూలుగుతున్నాయి. దాంతో రైతులు ఆర్థికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. పశుపోషణ భారంగా మారుతున్నది. ఈఎంఐలు కట్టకపోవడంతో బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. డబ్బు లేకపోవడంతో బయట మిత్తికి తెచ్చి చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది.
పాలు, పాల ఉత్పత్తులకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అధిక శాతం మంది పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 223 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. 2,500 మంది కర్షకులు పాల కేంద్రాలకు పాలను సరఫరా చేస్తుంటారు. రైతుల నుంచి రోజుకు 16 వేల లీటర్ల ఆవు, గేదె పాలను విజయ డెయిరీకి విక్రయిస్తుంటారు. పాల నాణ్యతను బట్టి లీటరుకు కనిష్టంగా రూ.39, గరిష్టంగా రూ.75 చెల్లిస్తున్నారు. తద్వారా రైతులు ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
రెండు నెలలుగా బిల్లులు బంద్..
సాధారణంగా విజయ డెయిరీలో పాలు పోసిన రైతులకు ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పటికప్పుడు బకాయిలు క్లియర్ అయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది. జిల్లాలో రెండు నెలలుగా రైతులకు బిల్లులు చెల్లించడం లేదు. నాలుగు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు రూ.కోటికి పైగా పాల ఉత్పత్తిదారులకు బకాయిలు ఉన్నాయి. పాల ఉత్పత్తిని బట్టి ఒక్కో రైతుకు నెలకు సగటును రూ.20 వేల నుంచి 50 వేల వరకు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రోజువారీ పాల కంటే అధికంగా సేకరించడంతో రొటేషన్ ఆగిపోతున్నదని, ఉత్పత్తుల అమ్మకాలు సరిగ్గా జరగడం లేదని, ఫలితంగా బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ లేకపోవడం కూడా ఓ కారణంగా పేర్కొంటున్నారు.
పశు పోషణకు అవస్థలు..
ఇప్పటికే రైతులకు రైతు బంధు రాకపోవడం, పాల బిల్లులు ఆలస్యం కావడంతో దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బిల్లుల పెండింగ్‌తో పాడి రైతులకు పశు పోషణ భారంగా మారింది. హోలిస్టిన్ ఫ్రీజియన్, జెర్సీ ఆవులకు ఖర్చు అధికంగా ఉంటుంది. ఉత్పత్తిలో వచ్చే ఆదాయంలో సగం వరకు పోషణకే వెళ్తుంది. పల్లి చెక్క, పత్తి చెక్క, తవుడు, మక్క పిండి, కాల్షియం అందించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు పాల బిల్లులు రాకపోవడంతో దాణాకు తిప్పలు తప్పడంలేదు. అంతేగాక పశువులకు ఏదైనా వ్యాధి సోకినా చికిత్స, మందులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లుల జాప్యంతో కొంతమంది పాల ఉత్పత్తిదారులు బయట ప్రైవేట్‌లో అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. మరోవైపు రుణాలతో గేదెలను కొనుగోలు చేసిన రైతులు బ్యాంకులకు ఈఎంఐలను చెల్లించలేకపోవడంతో కిస్తీలు కట్టాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు.
జూలై నుంచి పాల బిల్లులు రాలేదు
ఉదయం, సాయంత్రం కలిపి రోజుకు 100 లీటర్ల పాలను ఊళ్లో పాల సెంటర్లో పోస్తా. జూలై నుంచి బిల్లు రాలేదు. లక్షా 20 వేల రూపాయల బిల్లు విజయ డెయిరీ వాళ్ల నుంచి రావాల్సి ఉంది. పాలు సేల్ అవడం లేదు. పౌడర్ తయారు చేస్తున్నారట. పాల సేల్ పెరిగినప్పుడు వెంటనే బిల్లు ఇచ్చేది. అసలే పండుగల సీజన్. డబ్బు చాలా అవసరం ఉంది. నెలల తరబడి బిల్లులు చెల్లించకపోతే ఎలా?
– మేకల సునీత , శివారెడ్డిగూడెం గ్రామం, భూదాన్‌పోచంపల్లి మండలం