యాదాద్రి భువనగిరి, మే 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో గంజాయి విక్రయం కొత్త పుంతలు తొక్కుతున్నది. అడ్డదారుల్లో జిల్లాకు చేరుతున్నది. గతానికి భిన్నంగా రవాణా, వినియోగం జరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా వలస కార్మికులకు అడ్డాగా మారుతున్నది. బిహార్, యూపీ, ఒడిశా, బెంగాల్ నుంచి వచ్చిన వలస కార్మికులు యథేచ్ఛగా గంజాయి, డ్రగ్స్ వినియోగించడంతోపాటు అడ్డగోలుగా అమ్ముతుండటంతో సులభంగా దొరుకుతున్నది. ఇటీవల ఈ తరహా ఘటనలు పెరిగిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది. సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకుంటున్నారు.
తక్కువ ధరకు కొని.. ఎక్కువ రేటుకు అమ్ముతూ ఆదాయం గడిస్తున్నారు. రోజు రోజుకు గంజాయి ముఠాలు పెరుగుతూ పోతున్నాయి. ఇందుకు ప్రత్యేకంగా నెట్వర్క్ తయారు చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులకు పట్టుబడకుండా చాకచక్యంగా కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి సరుకును సరిహద్దులు దాటించేందుకు లారీల్లో బొగ్గుపొడి కింద, ఫ్లైయాష్ ఇటుకల్లో, వాహనాల కింద అరలు ఏర్పాటు చేయడం, కొబ్బరి బొండాల మధ్య, ఇనుప రేకుల మధ్యలో గంజాయి బస్తాలను పెట్టడం తదితర మార్గాలను ఎంచుకుంటున్నారు. కోడ్ భాషలతోనే గంజాయి దందా నడిపిస్తున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో జోరుగా గంజాయి రవాణా జరుగుతున్నది.

జిల్లాలో కొత్త దారుల్లో గంజాయి వినియోగం, రవాణా సాగుతున్నది. జిల్లాలో పెద్ద ఎత్తున వలస కూలీలు ఉన్నారు. దాదాపు అన్ని రంగాల్లో వారు చొచ్చుకుపోయారు. నిత్యం వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీరంతా బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బెంగాల్ నుంచి వచ్చిన వారే. ఇప్పుడు వీరే డ్రగ్స్, గంజాయి సరఫరాకు సూత్రధారులు. సొంత రాష్ర్టాలకు వెళ్లినప్పుడు రైళ్లలో గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడికి తరలిస్తున్నారు. గుట్కా, పాన్ పరాగ్‌లో కొద్ది మొత్తంలో కలుపుకొని తింటున్నారు. అంతే కాకుండా ఈజీగా డబ్బు వస్తుండటంతో ఇతరులకు అమ్ముతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి.
ఇటీవల చౌటుప్పల్‌లోని ఓ కంపెనీలో ఆబ్కారీ శాఖ అధికారులు ఆకస్మిక దాడి చేయగా, గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఇక జిల్లాకు ధూల్‌పేట నుంచి గంజాయి రవాణా అవుతునప్పటికీ గతంలో పోలిస్తే చాలా తగ్గినట్లు తెలుస్తున్నది. ఇక ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి కూడా గంజాయి రవాణా అవుతున్నది. మన దగ్గర రెండు జాతీయ రహదారులు ఉండటంతో జిల్లా మీదుగా గంజాయి జోరుగా రవాణా జరుగుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మీదుగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలుతున్నది. ఈ విషయమై పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గంజాయి విక్రేతలు విద్యార్థులు, యువతే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్‌కు దగ్గరలో ఉండటంతో ఇంజినీరింగ్‌తోపాటు వివిధ కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను ఎంచుకుని.. మొదటగా ఈ రొంపిలోకి లాగి.. మెల్ల మెల్లగా అలవాటు చేస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు.
భువనగిరి నడిబొడ్డులో ఉన్న జూనియర్ కళాశాలలో విక్రయాలు జరుపుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గంజాయి రవాణాకు ఇబ్బందిగా మారుతుండటంతో పెడ్లర్లు హాషిష్ ఆయిల్ వైపు మళ్లుతున్నారు. లాభంతోపాటు రవాణా సులువుగా ఉండటంతో చిన్న చిన్న బాటిళ్లలో నింపుకొని జోరుగా రవాణా చేస్తున్నారు.
మే 20 : భువనగిరి పట్టణంలోని టీచర్స్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్న బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద 200 గ్రాముల గంజాయి లభ్యమైంది. బిహార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
మే 15 : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బ్రౌన్ షుగర్ అమ్ముతున్నారనే సమాచారంతో ఇద్దరు వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. దీని విలువ రూ. 5లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బెంగాల్ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.