నీలగిరి, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు, బాధితుల గోడు వినేవారే కరువయ్యారని.. జిల్లా మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకుందామని వస్తే అక్రమంగా అరెస్టు చేసి జైల్లో వేస్తారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ ట్రిపుల్ ఆర్ బాధితులు వాపోయారు. వివరాల్లోకి వెళ్లితే హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డుకు సంబంధించి హెచ్ఎండీఏ వెబ్సైట్లో దక్షిణభాగం అలైన్‌మెంట్‌ను విడుదల చేసి, ఈనెల 15వ తేదీలోగా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరుతూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నల్లగొండ పర్యటనలో ఉన్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసేందుకు గట్టుప్పల్ మండలం తేరట్‌పల్లికి చెందిన నిర్వాసితులు శనివారం వచ్చారు.
నల్లగొండ గడియారం సెంటర్లోని ఇందిరాభవన్ వద్ద మంత్రిని కలిసి మెమెరాండం ఇద్దామని నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము ఎలాంటి అందోళనలు చేయడం లేదని శాంతియుతంగా మంత్రికి వినతి పత్రం అందజేసి వెళ్లిపోతామని వారు ఎంత చెప్పినా వినకుండా అరెస్టు చేసి, బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసుల వాహనంలో పడేశారు. ఈక్రమంలో బాధితులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అరెస్టు చేసిన నిర్వాసితులను పోలీసులు నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి మంత్రి పర్యటన ముగిసిన అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు.
ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ మొదటి అలైన్మెంట్ ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టాలని, రెండో అలైన్మెంట్లో ప్రకటించిన విధంగా చేయవద్దని మంత్రిని వేడుకుందామని వస్తే అరెస్టు చేయడం అన్యాయమన్నారు. గ్రామంలో ఎకరం నుంచి ఐదెకరాల్లోపు భూములు ఉన్న సన్న చిన్నకారు రైతుల భూములు మొత్తంగా పోతున్నాయన్నారు. దీంతో తాము నిర్వాసితులవుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా 216 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల మీదుగా రోడ్డు నిర్మాణం చేపడితే బాగుంటుందని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చామన్నారు. అంతేకాకుండా పరిహారం ఎకరాకు కేవలం రూ.10 లక్షల లోపు ఇస్తున్నారని, అక్కడ బహిరంగ మార్కెట్లో విలువే రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.
చౌటుప్పల్, సెప్టెంబర్ 13 : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని ఉత్తర, దక్షిణభాగంలో భూములు కోల్పోతున్న రైతులు చేపడతున్న నిరసనలు ఆగడం లేదు. నిత్యం వివిధ రకాల్లో ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. పంటలు పండే భూములను తీసుకొని ఉపాధికి దూరం చేస్తున్నారని బాధిత రైతులు భగ్గుమంటున్నారు. ఓఆర్ఆర్ నుంచి మిగతా చోట్ల మాదిరిగా 40 కిలోమీటర్లు తీసుకోవాలని లేనిపక్షంలో భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు ఉధృతం చేస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ విషయమై హెచ్ఎండీఏ ప్రాథమిక నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 15లోగా భూములు కోల్పొతున్న రైతులు తమ అభ్యంతరాలు తెలిపాలని కోరింది. అనంతరం తుది నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. దీంతో రైతులు తమ పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు. మొన్న హైదరాబాద్‌లోని హెచ్‌డీఏ కార్యాలయం ఎదుట మెరుపుదాడి చేశారు. నిన్న చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.
65వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే పోలీసులు భారీ సంఖ్యలో మొహరించి వారిని ఆరెస్టు చేశారు. తాజాగా శనివారం మంత్రి కోమటిరెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆందోళన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. దీంతో చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, సంస్థాన్‌నారాయణపురం, గట్టుప్పల్ తదితర మండలాల్లోని పలువురు రైతులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఉదయం 6 గంటలకే పోలీసులు వారి ఇండ్లకు వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గత ఎన్నికల ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన హామీ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అధికారం రాక ముందు ఒకలా వచ్చాక మరోలా మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రైతులు వ్యవసాయ పనులు మాని రోడ్డెక్కితే కనికరం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో మాట్లాడేందుకు కూడా మంత్రి సమయం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. ఏది ఏమైనా తమ భూములను ట్రిపుల్ ఆర్కు ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు.