రామగిరి, ఏప్రిల్ 14 : నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని నామమాత్రంగా నిర్వహించి అవమాన పరిచారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొనాల్సిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉద్దేశపూర్వకంగా చిన్నచూపు చూసి, నాలుగు గోడల మధ్య కేవలం కొద్దిమంది ప్రొఫెసర్లతో నిర్వహించడం ద్వారా యూనివర్సిటీ వీసీ అంబేద్కర్ గౌరవాన్ని కించపరిచారు. ఇది కేవలం ఒక మహనీయుడికి అవమానం మాత్రమే కాదు ఇది యూనివర్సిటీలో చదువుతున్న వేలాది దళిత, బహుజన విద్యార్థుల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి.
అధికారికంగా ఘనంగా నిర్వహించాలని అనేకసార్లు విద్యార్థి సంఘాలు వినతి పత్రాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా వీసీ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం తీవ్రంగా ఖండనీయం అన్నారు. విద్యార్థులు ప్రశ్నించగానే సమాధానం ఇవ్వకుండా అక్కడినుండి వెళ్లిపోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఇది ఒక్క అంబేద్కర్ విషయమే కాదు బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల జయంతులను కూడా అధికారికంగా నిర్వహించకుండా ఎన్ఎస్ఎస్ పేరిట పరిమితం చేయడం ద్వారా యూనివర్సిటీ పరిపాలన దళిత, బహుజన సమాజాన్ని వ్యవస్థాపితంగా అవమానిస్తున్నదనే అనుమానం బలపడుతోంది.
వీసీ ప్రవర్తన పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల వ్యతిరేకంగా ఉందని, దళితులను అంటరానివారిగా చూసే విధంగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో మాదిగ విద్యార్థి సంఘాల నాయకులు, బహుజన విద్యార్థులు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద వీసీ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇకపై మహనీయుల జయంతులను అధికారికంగా, ఘనంగా నిర్వహించాలని బహుజన విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనుముల సురేశ్ స్వేరో, ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు మాచర్ల సుధీర్ మాదిగ, ఎస్ఎఫ్ఐ నాయకులు కర్రెం రవి, పీడీఎస్‌యూ అధ్యక్షుడు హర్ష, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అంబేద్కర్‌కు అవమానం?.. ఎంజీయూలో వీసీ దిష్టిబొమ్మ దహనం