రామగిరి జులై 8 (నమస్తే తెలంగాణ): ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ (Khaja Althaf Hussain) అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాలకు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థుల పరిశోధన పత్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగింపు వేడుకకు అతిథిగా విచ్చేసిన ఉప కులపతి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడారు.
శాస్త్రీయ దృక్ఫథంతో ఆలోచించాలని.. పరిశోధనలతో సమాజాల్లో మార్పు తీసుకురావాలని విద్యార్థులను వీసీ కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) ఆహార భద్రత విభాగం హెడ్ డా ఎం సతీష్ కుమార్ (Satish Kumar) ఆహార పదార్థాల్లో ఫంగల్ కాలుష్యం అనే అంశంపై ప్రసంగించారు. శ్రీలీంధ్రాల కాలుష్యం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని, గతంలో జరిగిన వివిధ పరిశోధనలను ఉటంకిస్తూ ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మొత్తం 21 మంది విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు, 13 మంది తమ పరిశోధనలను చిత్ర రూపకంగా పోస్టర్ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా కె ప్రేమ్ సాగర్, డా. తిరుమల, ఆచార్య అన్నపూర్ణ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.