Ben Stokes : సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్‌ను అజేయ శక్తిగా నిలపాలనుకున్న బెన్ స్టోక్స్ (Ben Stokes) కల చెదురుతోంది. కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ రాకతో ‘బజ్ బాల్'(Baz Ball) అంటూ టెస్టుల్లో కొత్త ఒరవడి సృష్టించిన స్టోక్స్ సేనకు భారత జట్టు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. నిరుడు టీమిండియా పంచ్‌కు 4-1తో సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలోనూ దారుణ ఓటమి చవిచూసింది. లార్డ్స్‌లో విజయంపై కన్నేసిన ఆ జట్టును కెప్టెన్ స్టోక్స్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సారథిగా రాణిస్తున్న అతడు బ్యాటర్‌గా మాత్రం తేలిపోతున్నాడు. చెప్పాలంటే స్టోక్స్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.
టెస్టు సారథిగా 2022 ఏప్రిల్‌లో పగ్గాలు అందుకున్న స్టోక్స్ ఇంగ్లండ్‌ను బలమైన జట్టుగా మార్చాడు. కోచ్ మెక్కల్లమ్తో కలిసి బజ్‌బాల్ ఆటకు రూపమిచ్చాడు. అతడి నాయకత్వంలో ఇంగ్లండ్ వరుస విజయాలతో చెలరేగింది. అయితే.. నిరుడు భారత పర్యటనలో ఓటమితో స్టోక్స్ సేన జైత్రయాత్రకు తెరపడింది. గతంలో ఒంటిచేత్తో జట్టును గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, మోకాలి గాయం.. సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత అతడి ఆట లయ తప్పింది. రెండేళ్ల క్రింత లార్డ్స్‌లో సెంచరీ బాదిన స్టోక్స్ ఈ మధ్య ఒక్కసారి కూడా మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. అతడి సగటు కూడా 30లోపే ఉంది. టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడిన అతడి ఫామ్ ఇంగ్లండ్‌ను కలవరపరుస్తోంది. స్పిన్ సమర్ధంగా ఆడలేకపోతున్నాడు.
Ben Stokes’ last Test century was over two years ago, against Australia at Lord’s in the 2023 Ashes 👀 pic.twitter.com/6pnLFqxrR7
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2025
గత ఏడాది నుంచి టెస్టుల్లో స్టోక్స్ గణాంకాలు దారుణంగా పడిపోయాయి. 2024 నుంచి 28 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్టార్ ప్లేయర్ 26.80 సగటుతో 697 రన్స్ చేశాడంతే. అందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయంతే. డబ్ల్యూటీసీ సీజన్ 2025-27లో ఇంగ్లండ్ సారథి తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టులో 20, 33 రన్స్ మాత్రమే చేసిన స్టోక్స్.. బర్మింగ్హమ్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో జట్టును గట్టెక్కిస్తాడనుకుంటే లంచ్‌కు ముందు (33 రన్స్‌కే) ఔటయ్యాడు. అయితే.. లార్డ్స్‌లో ఘనమైన రికార్డు కలిగిన ఇంగ్లీష్ కెప్టెన్ భారీ స్కోర్‌తో రాణించాలని అభిమానులు, కోచ్ మెక్కల్లమ్తో పాటు ఈసీబీ కోరుకుంటోంది. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్టు జూలై 10 న మొదలుకానుంది.