భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఆ లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు వంటి గొప్ప సంక్షేమ పథకానికి రూపకల్పన చేశానని తెలిపారు. మంగళవారం రాయగిరిలో దళితులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లితో కలిసి ఎమ్మెల్యే పైళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు దళితులను ఓటు బ్యాంకుగానే చూశారని, ఇప్పుడు కూడా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అర్హులైన ప్రతి దళితుడికీ దళితబంధు అందిస్తామని చెప్పారు. టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి మాట్లాడుతూ దేశంలోనే దళితుల అభ్యున్నతికి ప్రాధాన్యతను కల్పించిన నాయకుడు సీఎం కేసీఆర్ తప్ప మరెవ్వరూ లేరన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కారుకు దళిత బిడ్డలంతా అండగా నిలువనున్నట్లు స్పష్టంచేశారు.
దళితులు ఉన్నతస్థాయిలో స్థిరపడి ఆత్మ గౌరవంతో జీవిస్తే చూడాలనుకున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ పరిధిలోని రాయగిరి ఏకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో టీఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగతో కలిసి పాల్గొని మాట్లాడారు. గత పాలకులు దళితులపై చిన్నచూపు చూశారని, దళితుల అభ్యున్నతికి ఏ పథకం తీసుకురాలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను అకున చేర్చుకొని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. దళితులను ఉన్నత స్థాయిలో చూడలన్న ఆలోచనతో వారు అడగకముందే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఏ రోజు కూడా దళితులను అదుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దళితుల ఓట్ల కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
భువనగిరి నియోజకవర్గంలో దళిత బంధు కోసం రూ.110 కోట్లు మంజూరయ్యాయని, మరిన్ని నిధుల కోసం సీఎంని అడిగి తీసుకొద్దామనుకున్న సమయంలో ఎన్నికల కోడ్ వచ్చినట్లు తెలిపారు. ఎన్నికల తరువాత అర్హులైన ప్రతీ దళితునికి దళిత బంధు అందించే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల మాయమాటలు విని ఆగం కావొద్దని, కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు చిలుకమారి గణేష్మాదిగ, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల శంకర్‌మాదిగ, నాయకులు నాగారం అంజయ్య, సురుపంగ సుగుణ, బొడ్డు కిషన్, బొట్ల యాదగిరి, గంగారం రమేశ్, మంచాల నరహరి, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జనగాం పాండు, ఏవీ కిరణ్‌కుమార్, నీల ఓంప్రకాశ్‌గౌడ్, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
దేశానికే ఆదర్శం దళిత బంధు ; ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. దళిత ఆత్మయ సమ్మేళనంలో భాగంగా ఆయన మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి తీసుకురావాలనే సంకల్పం కలిగిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడంతో పాటుగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆదర్శప్రాయుడిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. దళిత వ్యతిరేక శక్తులను ఓటుతో చిత్తుగా ఓడించాలని, దళితుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.