– కోదాడ ఆర్డీఓకు పెన్షనర్ల వినతి
కోదాడ, మార్చి 25 : కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన చేసిన 2025 వ్యాలిడిషన్ చట్టం దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో అంధకారం నింపుతుందని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా పెన్షనర్ల సంఘం పిలుపు మేరకు బుధవారం కోదాడలో ఈ చట్టానికి వ్యతిరేకంగా కోదాడ సంఘ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 1, 2026 కంటే ముందు పదవీ విరమణ చేసిన వారికి డీఏ, పీఆర్సీ ప్రయోజనాలు ఉండవని చెప్పడం పెన్షనర్ల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనెపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షుడు వి.జానయ్య, ఉపాధ్యక్షులు గులాం ఎస్ దాని, భ్రమరాంబ, సంయుక్త కార్యదర్శి భూపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ శంబయ్య, ఈసీ మెంబర్ బాలేమియా, మణిరం పాల్గొన్నారు.