ఆత్మకూరు.ఎస్, అక్టోబర్ 25 : పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సూర్యాపేట జిల్లా సహాయ సంచాలకుడు డాక్టర్ బి.వెంకన్న అన్నారు. శనివారం ఆత్మకూరు.ఎస్ మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామంలో చేపట్టిన ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా నష్టం చేసే వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి అన్నారు. ఈ వ్యాధి వస్తే చూడి పశువులకు అబార్షన్ అయ్యే అవకాశం ఉందని, పాడి పశువులు అధిక జ్వరంతో బాధపడుతూ, ఎద్దులు దుక్కి దున్నే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నారు. ఈ వ్యాధి నివారణ టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. గ్రామంలో 200 బర్రెలు, ఎద్దులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశు వైద్యాధికారి డా.నాగేంద్రబాబు, శ్రీను, గోపాలమిత్ర సైదులు, రైతులు యరగని అంజయ్య, యరగాని శ్రీనివాస్, వెంకట్రెడ్డి, యరగాని నారాయణ, బోల్క శ్రీనివాస్ పాల్గొన్నారు.