నీలగిరి, డిసెంబర్ 24 : ఈ నెల 28 నుంచి 30 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో టీఎస్ యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో విద్యారంగంలో అసమానలు, అంతరాలు లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నట్లు వివరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలో తొలిరోజు సుమారు 7వేల మంది ఉపాధ్యాయులతో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నట్లు తెలిపారు. దేశంలో సామాజిక ఆర్థిక అంతరాలు తగ్గించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేశారని, విద్యద్వారానే అంతరాలు పోవాలంటే అందరూ ఒకే రకమైన బడిలో చదువాలని అన్నారు.
అసమానమైన విద్య ప్రజల మధ్య అసమానతలను పెంచుతుందన్నారు. ఢిల్లీ, కేరళ వంటి రాష్ర్టాల్లో మాత్రమే విద్యలో ఉన్నత స్థాయిలో ఉన్నాయని, మిగతా రాష్ర్టాల్లో పాలకుల కుట్రల వల్లే విద్యలో అంతరాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బి.అరుణ, నర్రా శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.అరుణ, జిల్లా కార్యదర్శులు రమాదేవి, నల్పరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, కొమర్రాజు సైదులు పాల్గొన్నారు.