హుజూర్నగర్, మే 12 : మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ సీనియర్ నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలంగాణ సాయుధ రైతాంగ వీరనారి పశ్య కన్నమ్మ సంతాప సభలో నారాయణ మాట్లాడుతూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టెర్రరిస్టులు ఇప్పటివరకు ఎప్పుడైనా ఆకస్మికంగా కాల్పులు జరపడం వెళ్లిపోవడమే చూశామని, మొదటిసారి మత ప్రాతిపదికన చంపడం జరిగిందన్నారు. దేశంలో జరుగుతున్న టెర్రరిస్ట్ దాడులపై ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. దేశంలో ఎన్నికలు జరిగినప్పుడే టెర్రరిస్టులు దాడులు జరపడం, అమాయకులు బలి కావడం దానిని బీజేపీ వాడుకోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు.
అమెరికా ఒకవైపు పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తూనే టెర్రరిస్ట్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. తీవ్రవాద సమస్యకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేయడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుందని విమర్శించారు. మతాన్ని, టెర్రరిజాన్ని ఎన్నికల లబ్ధి కోసం ఉపయోగించుకోవడం ఆటవిక సాంప్రదాయమని, అది కొంతమంది నాయకుల శాడిస్ట్ మెంటాలిటీని తెలియజేస్తుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండు ఒకే సంవత్సరం ఆవిర్భవించినా దేశం కోసం పోరాడిన చరిత్ర, నిజమైన దేశభక్తి కమ్యూనిస్టులదే అన్నారు. దేశ రక్షణ, ప్రజా ప్రయోజనాల రక్షణకు సీపీఐ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, అక్కినేని వనజ, భావం హేమంతరావు, మహిళా సమాఖ్య జాతీయ కార్యదర్శి రజని, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, రైతాంగ పోరాట నాయకుడు దొడ్డ నారాయణరావు, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హేమంతరావు, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తేల సృజన, రంగారెడ్డి సీపీఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి, గంగాభవాని, యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు ప్రేమ్ పావని, అమీనా, సదాలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.