త్రిపురారం, అక్టోబర్ 6: పంట చేతికొచ్చినా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. సోమవారం త్రిపురారంలోని రైతు వేదిక వద్ద రైతులు ఉదయం నుంచే చెప్పులు క్యూలో పెట్టి అధికారుల కోసం వేచి ఉన్నారు. పంట చేతికొచ్చే సమయంలో కూడా యూరియా తిప్పలు తప్పడం లేదని, చివరి దశలో యూరియా వేయకపోతే పంట దిగుబడి రాదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే యాసంగి పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఆరుబయటే అన్నం..
తెల్లవారుజామునే యూరియా కోసం రావడంతో ముఖం కూడా కడుక్కోలేని పరిస్థితి నెలకొందని, ఇక్కడ క్యూలో నిలబడితే ఇంటి వద్ద ఉన్న వారు అన్నం వండి తేవడంతో ఆరు బయటే తింటున్నామని పెద్దదేవులపల్లి గ్రామ రైతులు తెలిపారు. ఈ ఉసురు తప్పకుండా ప్రభుత్వానికి తగులుతుందని, కోరి తెచ్చుకున్నవాడే కొంపకు నిప్పటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు శాపనార్ధాలు పెడుతున్నారు.
అర్ధరాత్రి 2గంటలవరకూ పోలీస్ స్టేషన్లోనే..
తిరుమలగిరి(సాగర్), అక్టోబర్ 6: తిరుమలగిరిలో గత రాత్రి యూరియా కోసం సుమారు 20 మంది రైతులు రాత్రి 11గంటల నుంచి మార్కెట్ సబ్ యార్డులో పడిగాపులు కాశారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో పెద్ద వర్షం రావడంతో తడిసి ముద్దయ్యారు. కొంత సమయం తరువాత పక్కనే ఉన్న పోలీస్స్టేషన్లో తలదాచుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల వరకు వర్షం రావడంతో వారు 2గంటల వరకు అక్కడే ఉన్నారు.
అనంతరం 3గంటల నుంచి యూరియా కోసం క్యూలో వేచి ఉన్నారు. సోమవారం ఉదయం 7, 8 గంటల సమయంలో సుమారు 300 మంది రైతులు రావడంతో స్వల్ప ఘర్షణ తలెత్తడంతో పోలీసులు, అధికారులు కలుగజేసుకొని వారికి సర్దిచెప్పారు. అనంతరం క్యూలో ఉన్నవారికి యూరియా అందజేశారు. అయినప్పటికీ కొందరికే అందడంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు.
పలుకుబడి ఉన్న రైతులకే యూరియా..
మఠంపల్లి, అక్టోబర్ 6 : రోజులు గడుస్తున్నా యూరియా కష్టాలు మాత్రం తీరడం లేదని రైతులు వాపోతున్నారు. మఠంపల్లి పీఏసీఎస్ వద్ద సోమవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పలుకుబడి ఉన్న రైతులకే యూరియా అందుతోందని, పేద రైతులకు యూరియా అందకపోవడంతో రోజుల తరబడి తిండీ తిప్పలు మాని క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.