కట్టంగూర్, సెప్టెంబర్ 04 : రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తిండి తిప్పలు, నిద్రాహారాలు మాని, రేయి పగలు అన్న తేడా లేకుండా ఎండ వానను లెక్కచేయకుండా అన్నదాతలు యూరియా కోసం రోజూ పడిగాపులు కాస్తూనే ఉన్నారు. వ్యవసాయ పనులు వదిలేసి మరీ యూరియా కోసం సింగిల్ విండో కార్యాలయాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నా బస్తా యూరియా కూడా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టంగూర్ పీఏసీఎస్ కు బుధవారం సాయంత్రం 444 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న కొంత మంది రైతులు అదే రాత్రి 10 గంటల నుంచి గోదాం వద్దకు చేరుకుని పేరు నమోదు చేసుకుని పాస్ బుక్ జీరాక్స్ లను సీరియల్ పెట్టి అక్కడే నిద్రించారు.
గురువారం తెల్లవారుజామున మరికొంత మంది రైతులు యూరియా కోసం వచ్చి క్యూలో ఉన్నారు. ఒకానొక సమయంలో క్యూలో ఉన్న రైతుల మధ్య తోపులాట జరగడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. మళ్లీ రైతులను క్యూలో నిలబెట్టి సీరియల్ ప్రకారం 440 మంది రైతులకు టోకెన్లు అందజేశారు. 10 గంటల తర్వాత వ్యవసాయ అధికారి గిరి ప్రసాద్, సీఈఓ మల్లారెడ్డి పర్యవేక్షణలో ప్రతి రైతుకు ఒక బస్తా చొప్పున సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేశారు. శుక్రవారం లారీ లోడు వస్తుందని అధికారులు తెలుపడంతో యూరియా దొరకని రైతులు వెనుదిరిగిపోయారు. యూరియా పంపిణీని ఎస్ఐ మునుగోటి రవీందర్, మండల ప్రత్యేక అధికారి సతీశ్, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు సందర్శించి రైతులతో మాట్లాడి అధికారులకు సహకరించాలని సూచించారు.