నల్లగొండ, ఫిబ్రవరి 27: జిల్లాలో యూరియా కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మార్క్‌ఫెడ్ అధికార యంత్రాంగం ప్రధానంగా పీఏసీఎస్ చైర్మన్లతో ఏఆర్ఎస్కే, ఎఫ్పీఓలతో కుమ్మక్కై ప్రైవేటు ఫర్టిలైజర్లకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో సన్న, చిన్న కారు రైతులు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. బిల్లులు మాత్రం ఏజెన్సీల పేర్లతోనే చేస్తూ వారికి కొంత వాటా ఇచ్చి మిగిలిన వాటా మార్క్‌ఫెడ్ యంత్రాంగం నొక్కేస్తుందట.
ఒక్కో లారీకి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు అధికారులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో ఇండెంట్ పెట్టే వ్యవసాయ అధికారులతోపాటు సంబంధిత సెక్షన్ అధికారి, ఏడీఏలకు సైతం వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ యాసంగి సీజన్లో వాతావరణ పరిస్థితుల కారణంగా అధికంగా యూరియా వాడాలని అధికారులే ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఒక్కో ఎకరానికి రెండు బస్తాలకు బదులు నాలుగైదు బస్తాలు వేయడంతో డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా యూరియా రాకపోవడంతో క్షేత్రస్థాయిలో, మార్క్‌ఫెడ్‌లో నిల్వలు నిండుకున్నాయి.
జిల్లాలో వాతావరణ పరిస్థితుల కారణంగా యూరియా వాడకం పెరుగడం.. అవసరానికి తగిన యూరియా రాకపోవడం వల్ల ఈ కొరత ఏర్పడి బ్లాక్‌కు దారి తీసింది. ఈ సీజన్లో 5.10లక్షల ఎకరాల్లో వరి, 46వేల ఎకరాల్లో వేరుశనగ, కందులు, మిర్చితోపాటు 45వేల ఎకరాల్లో ఆయిల్ పామ్, బత్తాయి, నిమ్మ తోటలు సాగవుతున్నాయి. సుమారు ఆరు లక్షల ఎకరాలకు గానూ ఎకరాకు రెండు బస్తాలు(45 కేజీలు)చొప్పున సుమారు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 80వేల మెట్రిక్ టన్నులు వచ్చింది.
ఈ సారి వాతావరణ పరిస్థితుల కారణంగా వరి తల్లి వేరు త్వరగా ఈనటంతో పిల్ల వేరు ఈనటానికి మరో బస్తా లేదా రెండు బస్తాల యూరియా అధికంగా వేయాల్సి వచ్చింది. దాంతో ఆయకట్టు ఏరియాలో ఎకరాకు 4 నుంచి 5 బస్తాలు, నాన్ ఆయకట్టులో ఎకరాకు 3నుంచి 4 బస్తాలు వేయడంతో 1.50లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 80వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం నుంచి రాగా దీన్ని బ్లాక్ చేసి అదనంగా డబ్బులు చెల్లించిన రైతులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. దీన్ని మార్క్‌ఫెడ్ యంత్రాంగంతోపాటు వ్యవసాయ శాఖ క్యాష్ చేసుకుంటున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే పాక్షిక సమస్య ఏర్పడ్డ యూరియా కొరత రెండో ఏడాది నాటికి జఠిలమైంది. గడిచిన పదేండ్లలో అవలీలగా మార్కెట్లో లభించిన ఈ ఎరువులు ప్రస్తుతం బ్లాక్ దిశగా కొనుగోల్లు జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఏదో ఒక ఇతర ఎరువు(ప్రధానంగా పొటాష్) కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 45కేజీల యూరియా బస్తా రూ.330కి పైనే విక్రయిస్తున్నారు. జిల్లాలో 40 ఎన్డీసీఎంఎస్, 10ఎఫ్‌పీఓ, 70ఏఆర్ఎస్కే, 31పీఏసీఎస్‌లు ఈ వ్యాపారం చేస్తూ బాగానే వెనకేస్తున్నట్లు తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతి సీజన్లో పలు కంపెనీలకు చెందిన యూరియాలో 60శాతం మార్క్‌ఫెడ్‌కు, 40శాతం ప్రైవేటు హోల్ సేలర్స్ ద్వారా సరఫరా చేస్తుంది. యూరియా ఎమ్మార్పీ రూ.266(45 కేజీల బ్యాగ్) ఉండగా పీఏసీఎస్‌లకు అదే ధరకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆగ్రోరైతు సేవా కేంద్రం(ఏఆర్ఎస్కే), రైతు ఉత్పత్తి కేంద్రాలు(ఎఫ్‌పీఓ), ఎన్డీసీఎంఎస్లకు ఎమ్మార్పీ రూ.266తోపాటు ట్రాన్స్పోర్ట్ చార్జీలతో కలిపి(రూ.20) అందజేస్తారు. ఇక ప్రైవేటు హోల్‌సేలర్స్‌కు సైతం అంతే స్థాయిలో చెల్లించాల్సి వచ్చినప్పటి ఎమ్మార్పీకీ మాత్రమే విక్రయించాలని లేదంటే వద్దని ప్రభుత్వ ఆదేశాలు.
పీఏసీఎస్‌లకు బస్తా రూ.266మాత్రమే పడటంతో అధికంగా వారి పేరు మీద ఇండెంట్ పెట్టి ఇతర ప్రైవేటు డీలర్లకు ఇవ్వడం లేదా నేరుగా పెద్ద రైతులకే బస్తాకు రూ.25 నుంచి 35 తీసుకొని విక్రయించడం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక కొందరు ఎఫ్పీఓలు, ఏఆర్ఎస్కేలు సైతం ఇదే స్థాయిలో అధికార యంత్రాంగానికి చేయూతనిస్తున్నారు. దాంతో లారీకి రూ.10వేల నుంచి రూ. 20 వేల వరకు అదనంగా మార్క్‌ఫెడ్ యంత్రాంగం వసూలు చేసి తలా కొంత పంచుకుంటున్నారట. వీరి అక్రమాలకు అగ్రికల్చర్ ఏఓలు, సెక్షన్ అధికారులు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
జిల్లాలో ఈ సారి వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల ఎదుగుదలలో కొంత తేడా వచ్చి యూరియా వాడ కం పెరిగింది. ఈ సీజన్లో 70వేల మెట్రిక్ టన్నులకుగానూ 80వేలు రాగా ఇంకా మార్కెట్లో 4,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఎక్కడ కొనుగోలు చేసినప్పటికీ బస్తాకు రూ.266కు మించి ఇవ్వవద్దు. ఎవరైనా అంతకు మించి తీసుకుంటే ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.
-పాల్వాయి శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి, నల్లగొండ