సమైక్య రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు బారులు దీరడం చూశాం. అప్పట్లో తెల్లవారుజాము నుంచే రైతులు బారులుదీరేవారు. గంటల తరబడి నిలబడలేక చెప్పులు, పాసుపుస్తకాలు క్యూలైన్లలో పెట్టేవారు. ఇప్పుడూ అదే దుస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. మళ్లీ క్యూలైన్లు తెచ్చింది…యూరియా కోసం రైతుల నిద్రాహారాలు మాని తెల్లవారుజాము నుంచే ఎరువుల దుకా ణాల ఎదుట లైన్లు కడుతున్నారు. సర్కార్ తీరుతో గోస పడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాను నెల రోజులుగా యూరియా కొరత వేధిస్తోంది. ఇంకా అది తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. రూ.266కు లభించాల్సిన యూరియాను రైతులు బ్లాక్ మార్కెట్లో రూ.400 పెట్టి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. యూ రియా కోసం రైతులు కాళ్లు మొక్కే పరిస్థితి వచ్చింది. పొద్దస్తమానం క్యూలో నిలబడినా ఒక్క బస్తా కూడా దొరక్కపోవడంతో రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు.
తెల్లవారుజాము నుంచే పడిగాపులు
నల్లగొండ రూరల్;ఆగస్టు 23: జిల్లాలోని రైతులు పొద్దున లేస్తే యూ రి యా బాట పడుతున్నారు. లేచిందే ఆలస్యం ఎక్కడ యూరియా దొరుకుతుందో తెలుసుకోవడం..అక్కడికి తెల్లవారుజామున 4 గంటలకు వెళ్లడం … లైన్లు కట్టడం .. ఇలా ఉంది గత వారం రోజులుగా నల్లగొండ మండలంలోని రైతుల దినచర్య. నల్లగొండ మండలానికి సంబంధించిన రైతులకు శనివారం గుండ్లపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద గల రైతు ఆగ్రో సేవా కేంద్రానికి 300 బస్తాలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున తెల్లవారు జామునుంచే బారులు దీరారు. దీంతో ఏఈఓలు, పోలీసులు పర్యవేక్షణలో పేర్లు రాసుకొని ఒక్కో రైతుకు రెండు బస్తాలు అందజేశారు. అప్పటికే రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రైతు సేవా కేంద్రం నిర్వాహకులు చేసేదేమీ లేక చేతులెత్తేశారు. రైతులు ఆగ్ర హం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు వారి పేర్లు నమోదు చేసుకొని యూరియా ఎప్పుడు వస్తే అప్పుడు సమాచారం అందజేస్తామని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో వెనుదిరిగారు.
సొసైటీల చుట్టూ చక్కర్లు
మోతె, ఆగస్టు 23 : యూరియా కోసం అన్నదాతలు నానా తిప్పలు పడుతున్నారు. మండల పరిధిలోని సిరికొండ సొసైటీ వద్దకు యూ రియా లారీ రావడంతో శనివారం రైతులు పెద్ద ఎత్తున బారులు తీరారు. నాట్లు వేసి నెలకావొస్తున్నా యూరియా దొరక్కపోవడం తో సాగుచేసిన పంట ఎదుగుదలకు రాకుండా అక్కడే నిలిచిపోయిందని రైతులు వాపోతున్నారు. ఒక్కో రైతుకు ఒకే బస్తా చొప్పున ఇవ్వడంతో సరిపోవడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు.
యూరియా ఏ సొసైటీ వద్దకు వస్తుందోనని వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా తగిన మొత్తంలో ఇవ్వకపోవడంతో కొన్ని షాపుల వద్ద అదనంగా రేట్లు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కొన్ని షాపుల్లో ఏదో ఒకటి కొంటేనే యూరియా ఇస్తామని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యూరియా బస్తాతో పాటు ఏదో ఒకటి ఉపయోగం లేని మందులను కూడా అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. అవి తీసుకుంటూనే యూరియా ఇస్తామని లేకుంటే ఇవ్వమని కరాఖండిగా చెప్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కోసం ఇన్ని అవస్థలు ఎప్పుడూ పడలేదని అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
బారులు తీరినా అందని బస్తా..
నల్లగొండ సిటీ అగస్టు 23 : ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లలో పడిగాపులు కాసినా బస్తా యూరియా అందడం లేదని రైతు లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కనగల్ పీఏసీఎస్‌లో యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలుసుకున్న రైతులు ఉదయాన్నే వచ్చి బారులుదీరారు. మండల కేంద్రంలోని సహకార సంఘానికి 200 బస్తాల యూరియా మాత్రమే రావడంతో ఒక్కొక్కరికీ రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో రైతులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
అదును దాటిపోయిన తర్వాత యూరియా వేసినా లాభం ఉండదని, దిగుబడులపై ప్రభావం చూపుతుందని అవేదన వ్యక్తం చేశారు. సోసైటీకి కేవలం 200 బస్తాలు మాత్రమే రావడంతో 25 శాతం మందికే పంపిణీ చేయగా మిగిలిన రైతులు వెనుదిరిగి వెళ్లిపోయారు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగినా ముందుగా వచ్చిన రైతులకే యూరియా అందుతోందంటూ వారు వాపోయారు. ఇప్పటికే అదును దాటిపోతోందని యూరియా ఇవ్వాలని సొసైటీ సిబ్బందిని కోరితే రేపు మాపంంటూ దాటవేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు.
గోదాం వద్దే తిండీ తిప్పలు
నిడమనూరు, ఆగస్టు 23: యూరియా కోసం బారులుదీరిన రైతు లు వెంట తెచ్చుకున్న సద్ది తింటూ పడిగాపులు పడుతున్న సంఘట న శనివారం నిడమనూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో కనిపించింది. సహకార సంఘం వద్ద ఉదయం 5 గం టల నుంచే యూరియా కోసం రైతులు బారులుదీరారు. 12 రోజులుగా యూరియా రాకపోవడంతో శనివారం ఉదయం ఒక్కసారిగా నిడమనూరు పీఏసీఎస్ భవనం వద్దకు చేరుకున్నారు. సుమారు 800 మంది రైతులు యూరియా కోసం క్యూకట్టారు. మొత్తం 444 బస్తాలను ఒక్కో రైతుకు రెండు చొప్పున పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.
భార్యాబిడ్డలతో క్యూలో నిల్చున్నా యూరియా దొరక్క పోవడంతో అందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో లోడు రాగానే పంపిణీ చేస్తామని చెప్పడంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. యూరియా కోసం వచ్చిన ధన్సింగ్ తండా గిరిజన రైతులు కార్యాలయం వద్దే క్యూలోనే అల్పాహారం తింటూ కనిపించారు. రాత్రంతా బస్టాండులో పడుకుని ఉదయం 6 గంటలకు క్యూలో నిల్చున్నామని, గతంలో ఎన్నడూ చూడని కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చూస్తున్నామని రైతులు నూనావత్ సైదా, మెగావత్ మొయిలాల్, నూనావత్ లచ్చూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, యూరియా పంపిణీ తో ఆరు నెలల గాసం పెట్టి కన్న కొడుకులా తమను పోషించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు దొంగల మాదిరి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక్క లోడు.. వందలాదిమంది రైతులు..!
పెద్దఅడిశర్లపల్లి ఆగస్టు 23 : మండలంలో యూరియా కోసం రైతులు పరుగులు పెడుతున్నారు. వచ్చిన ఒక లోడు యూరియా కోసం వేకువజామున నుంచే పడి గాపులు గాస్తున్నారు. మొదటి దఫా యూరియా సీజన్ ప్రారంభం కావడంతో రైతులు యూరియా కోసం నానాతిప్పలు పడుతున్నారు. పది రోజుల తర్వాత ఒక లారీ యూరియా రావడంతో రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టి సహకార పరపతి సంఘం వద్ద ఎదురు చూస్తున్నారు. తిండితిప్పలు, పొలం పనులు మానుకొని అక్కడే ఉంటు న్నారు. ప్రభుత్వం గొసపెట్టకుండా యూరియా ఇవ్వలంటున్నారు.
వారం రోజులుగా తిరుగుతున్నా నో స్టాక్..
హుజూర్నగర్ రూరల్, అగస్టు 23 : హుజూర్నగర్ మండల పరిధిలోని బూరుగడ్డ పీఏసీఎస్ సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులుగాస్తున్నారు. వారం రోజులుగా సొసైటీ చుట్టూ తిరుగుతున్నా నో స్టాక్ బోర్డే దర్శనమిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా శనివారం తెల్లవారుజామున యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు బారులుదీరారు.
బూరుగడ్డ సొసైటీ పరిధిలో గోపాలపురం, కరక్కాయలగూడెం, మర్రిగూడెం, మాచవరం గ్రామాలు అంటే సుమారు 5వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. 250 టన్నుల యూరియా వస్తే గానీ రైతులకు సరిపోదు. కానీ 10 టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా 50 టన్నుల యూరియా రావాల్సి ఉంది. కాగా ఒక ఆధార్ కార్డుపై కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సరిపడా యూరియా సరఫరా చేయాలి
మఠంపల్లి, అగస్టు 23 : మఠంపల్లి మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచే మఠంపల్లిలోని పీఏసీఎస్ గోడౌన్ దగ్గర యూరియా కోసం పడిగాపులు గాశారు. ఒక ఆధార్ కార్డుపై రెండు కట్టలు మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. సరిపడా యూరియా సరఫరా చేయాలని అధికారులకో విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక లారీ యూరియా మాత్రమే వచ్చిందని, స్టాక్ లేకపోవడంతో యూరియా రాలేదని,రెండు ,మూడు రోజుల్లో వస్తుందని అధికారులు పేర్కొన్నారు.
బారులు తీరినా బస్తా కూడా అందలే..
మునుగోడు,ఆగస్టు 23: మునుగోడులోని సొసైటీ కార్యాలయానికి యూరియా స్టాక్ వచ్చిందనే సమాచారం తెలుసుకున్న రైతులు శనివారం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తెల్లవారు జామునుంచే రైతులు సొసైటీ దగ్గర వేచి ఉన్నారు.444 బస్తాలు యూరియా మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు.
అది కూడా పట్టాదారు పాసు పుస్తకం,ఆధార్ ఉన్నవారికి మాత్రమే పోలీసు బందోబస్తు మధ్య అందజేశారు. పొద్దంతా పడిగాపులు కాసినా బస్తా యూరియా అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు అంటే ఇదేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రోజుతరబడి యూరియా కోసం సొసైటీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. ముందుగా వచ్చిన రైతులకే యూరియా అందుతోందని వాపోయారు. కేసీఆర్ పాలనలోయూరియా కోసం ఇటువంటి పడిగాపులు ఎన్నడూ పడలేదన్నారు.