త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాలతో ఉత్సాహంలో ఉండగా.. ఇదే సరైన సమయమని భావిస్తూ తమ వారసులను బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. నల్లగొండ స్థానంపై మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుటుంబం కన్నేయగా.. భువనగిరి లోక్‌సభ స్థానంపై కోమటిరెడ్డి కుటుంబం దృష్టి సారించింది.
ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాలు మూడు కుటుంబాల చేతుల్లో ఉండగా.. తాజాగా రెండు లోక్‌సభ సీట్లపై రెండు కుటుంబాల నుంచే బరిలోకి దిగే యోచన చేస్తుండడంపై ఇతర ఆశావహుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. ఇన్నాళ్లూ కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తూ వచ్చిన ఈ పెద్దలే.. ఇప్పుడు తమ కుటుంబ సభ్యులను ఎలా తెరపైకి తేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీలో మొదలైన ఇంటి పోరు ఆసక్తికరంగా మారుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ముగ్గురు కీలక కాంగ్రెస్ నేతల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత లభించింది. హుజూర్నగర్, కోదాడ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి పోటీ చేసి గెలుపొందగా.. నల్లగొండ, మునుగోడు నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. ఇక నాగార్జునసాగర్‌లో మాజీ మంత్రి జానారెడ్డి తాను బరి నుంచి తప్పుకుని తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. వీరితో పాటు మొత్తం 12 స్థానాలకు గానూ 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ముఖ్యులు ఇప్పుడు లోక్‌సభ స్థానాలను సైతం తమ కుటుంబ సభ్యులకు దక్కేలా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం జానారెడ్డి కుటుంబంతోపాటు కోమటిరెడ్డి కుటుంబం తమ పాలిటిక్స్ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
నల్లగొండ లోక్‌సభ స్థానంపై సీనియర్ నేత జానారెడ్డి సీరియస్ గానే పావులు కదుపుతున్నారు. పార్టీ అవకాశం ఇస్తే తాను బరిలో ఉంటానని ఇటీవలే జానారెడ్డి తన మనసులో మాటను వెల్లడించారు. వాస్తవంగా వయసు రీత్యా జానారెడ్డి పోటీకి దిగకపోవచ్చనే రాజకీయ వర్గాల అంచనా. తన చిన్న కుమారుడు జయవీర్‌రెడ్డిని ఇటీవలే నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. ఇక పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డిని కూడా లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దింపితే తండ్రిగా తన బాధ్యత తీరిపోతుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
అందుకే నల్లగొండ నుంచి తాను బరిలో ఉంటానని పార్టీ పెద్దలకు సంకేతాలిస్తూ సందర్భాన్ని బట్టి రఘువీర్‌రెడ్డిని తెర పైకి తేనున్నట్లు సమాచారం. రఘువీర్‌రెడ్డి కూడా ఎప్పటి నుంచో చట్టసభల్లో అడుగుపెట్టాలని ప్రయత్నాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ బరిలో తమ్ముడు నిలబడడంతో ఎలాగైనా సరే ఎంపీ బరిలో తాను నిలబడాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకు సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాలు కూడా తమకు తోడ్పడుతుందని జానారెడ్డి కుటుంబం భావిస్తున్నది.
ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాజాగా లోక్‌సభ ఎన్నికలపైనా వీరి కుటుంబం దృష్టి సారించింది. భువనగిరి నుంచి తమ కుటుంబంలో ఒకర్ని బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. 2009లో పునర్విభజన నాటి నుంచి భువనగిరి స్థానంపై కోమటిరెడ్డి సోదరుల పట్టు కొనసాగుతున్నది. 2009, 2014లో రాజగోపాల్‌రెడ్డి పోటీ చేయగా 2018లో వెంకట్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దాంతో మరోసారి తమ కుటుంబ సభ్యులే బరిలో జాగ్రత్త పడుతున్నారు.
అవకాశం వస్తే తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ చేయించేందుకు రాజగోపాల్‌రెడ్డి యోచిస్తున్నారు. ఇదే సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్దన్న కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. ఇటీవల నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని తన తమ్ముడు, మంత్రి వెంకట్‌రెడ్డితో కలిసి మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగానే తన కుమారుడు సూర్యపవన్రెడ్డికి భువనగిరి నుంచి ఎంపీగా అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై మరోసారి చర్చిద్దామని రేవంత్‌రెడ్డి అన్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఎన్నడూ లేనిది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీడియాలో కోమటిరెడ్డి సూర్యపవన్‌రెడ్డి వేయించిన ప్రకటనలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి. మొత్తంగా భువనగిరిని తమ చేతి నుంచి చేజార్చుకోవద్దన్న పట్టుదలతో కోమటిరెడ్డి కుటుంబం కనిపిస్తుందన్నది నిజం.
ఇప్పటికే ఐదు అసెంబ్లీ స్థానాలు మూడు కుటుంబాల చేతుల్లో ఉండగా, తాజాగా రెండు లోక్‌సభ స్థానాలపైనా రెండు కుటుంబాలు కన్నేయడంపై పార్టీలోని ఇతర ఆశావహులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ ఎంపీ స్థానం సూర్యాపేటకు చెందిన పటేల్ రమేశ్‌రెడ్డికి ఇవ్వనున్నట్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ పెద్దలు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జానారెడ్డి కుటుంబం రంగంలోకి దిగడంతో రమేశ్‌రెడ్డి పరిస్థితి ఏంటన్న సందిగ్ధం నెలకొన్నది. ఇక భువనగిరి స్థానంపై రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ సైతం పోటీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరితోపాటు మరికొందరు కూడా టికెట్ కోసం పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుత పరిణామాలతో వీరంతా తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.