యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఊంజల్ సేవను శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పరమ పవిత్రంగా సేవలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త.. తనను కొలిచిన వారికి తానున్నానంటూ అభయ హస్తమిచ్చి కాపాడే లక్ష్మీ అమ్మవారిని అద్దాల మండపంలో విశేష పుష్పాలతో అలంకరించారు.
స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు ఘనం గా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. నిజరూప దర్శనంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పాతగుట్టలో స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 13వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. స్వామివారి ఖజానాకు రూ.16,55,809 ఆదాయం సమకూరిందని ఈఓ గీత తెలిపారు.