రామగిరి, సెప్టెంబర్ 03 : యూనివర్సిటీలు సమాజ హితమైన పరిశోధనలతో ముందుకు సాగాలని తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయూ సైన్స్ కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సైన్సెస్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకారంతో ‘మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్” అనే అంశంపై నిర్వహించే రెండు రోజుల జాతీయ సెమినార్‌కు బుధవారం ఆయన హాజరయ్యారు. ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్పేన్, గణితం విభాగం హెచ్ఓడీ డా.సి.మద్దిలేటితో కలిసి సెమినార్ పత్రాలతో ముద్రించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్య సమాజ దశ, దిశను నిర్దేశించే అత్యంత శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించి జీవితంలో స్థిరపడాలన్నారు.
ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘గణితం దాని ప్రాముఖ్యత- ప్రస్తుత సమాజంలో ఉపయోగం అనే అంశంపై వివరించారు. ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ.. గణిత శాస్త్రం నిత్య జీవితంలో మానవాళికి అనేక సేవలు అందిస్తుందని, ఆధునిక సమాజ నిర్మాణంలో గణితం పాత్ర విడదీయరానిదన్నారు. బి.ఎస్.కే యూనివర్సిటీ బళ్లారి ప్రొఫెసర్ పద్మనాభరెడ్డి, జాతీయ సాంస్క్రిట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏ.చందూలాల్ పలు గణితం అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అదే విధంగా వివిధ యూనివర్సిటీల పరిశోధన విద్యార్థులు (రీసర్చ్ స్కాలర్స్) తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. అనంతరం ఎంజీయూలో గణితంలో పీజీ కోర్సు పూర్తి చేసి, తదుపరి సీహెచ్ఏ, ప్రభుత్వ ఉద్యోగాలు సాదించిన విద్యార్థులను వర్సిటీ గణిత విభాగం అధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గణిత విభాగం సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సేఓఈ డా.జి.ఉపేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ అన్నపూర్ణ బుట్టి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Ramagiri : వర్సిటీలు సమాజ హిత పరిశోధనలతో ముందుకు సాగాలి : చారకొండ వెంకటేశ్