– నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) ను రద్దు చేయాలి
– కోదాడలో వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నిరసన
కోదాడ, జూలై 24 : నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడ పట్టణంలో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు నీట్ పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగించడం, నిర్బంధ చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీలు మూడు సార్లు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిలో బీజేపీతో సంబంధాలున్న వ్యక్తులు ఉన్నారనే ఆరోపణలు వచ్చినప్పటికీ, వారిని కాపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అసలు దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను కొందరు బీజేపీ మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో దేశద్రోహులు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నమని విమర్శించారు. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టిన నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారి ఆందోళన కార్యక్రమంలో ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యూ, ఏఐవైఎఫ్, పివైఎల్, డివైఎఫ్ఐ నాయకులు టి.నరేష్, పి.బ్రహ్మం, చేపూరి కొండలు, డి.రవి, సాయికుమార్, నాయకులు ఉపేందర్, గంట నాగరాజు, షేక్ నాగుల్ మీరా, ఖడారు మధు, మాదాసు చరణ్, తుమ్మల అరవింద్, మీసాల నరేందర్ పాల్గొన్నారు.