జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. బోర్లు, బావులు నీటి జాడ లేక వట్టిపోతున్నాయి. జనవరి నెలలో సగటున 10 మీటర్ల కిందికి వెళ్లాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఎండకాలం పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. జిల్లాలో గతంలో పుషలంగా ఉన్న పాతాళ గంగ ఇప్పుడు అడుగంటుతున్నది. ఇంతకుముందు ఐదు మీటర్ల లోతులోనే నీళ్లు ఉండగా, ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో కిందికి వెళ్లాయి. జిల్లాలో 2024 జనవరిలో 7.29 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈ జనవరిలో 10 మీటర్లకు చేరాయి. 2.71 మీటర్ల మేర పడిపోయాయి. డిసెంబర్లో 9.03మీటర్ల దూరంలో ఉండగా.. నెల వ్యవధిలోనే మీటరు కిందికి వెళ్లాయి.
మండలాల వారీగా..
జిల్లాలో 17మండలాలు ఉండగా.. గతేడాది జనవరితో చూస్తేఅడ్డగూడూరు మినహా అన్ని చోట్లా భూగర్భ జల మట్టం తగ్గింది. అత్యధికంగా సంస్థాన్‌నారాయణపురం మండలంలో ఇంకిపోయింది. ఏకంగా 11.48 మీటర్ల మేర కిందికి నీళ్లు పడిపోయాయి. గతేడాది 10.61 మీటర్లలో నీళ్లు ఉండగా, ఈసారి ఏకంగా 22.09 మీటర్లకు పడిపోయాయి. ఆత్మకూరు(ఎం)లో 17.10, తురపల్లి, ఆలేరు, బొమ్మలరామారం, రామన్నపేట, మోటకొండూరు మండలాల్లో 11మీటర్ల దూరంలో ఉన్నాయి. అడ్డగూడూరులో 4.01, భూదాన్‌పోచంపల్లిలో 4.73, చౌటుప్పల్‌లో 5.69 మీటర్ల వద్ద నీటి మట్టం ఉంది.
నీళ్లకు కష్టాలే..
జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అధికంగా వరి వేశారు. జిల్లాలో వేల సంఖ్యలో బోరు బావులు ఉన్నాయి. వీటి కింద అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. ఈసారి వానకాలంలో వర్షపాతం సాధారణంగానే నమోదైనప్పటికీ, యాసంగి సాగు విస్తీర్ణం పెరుగడంతో బోరుబావుల ద్వారా నీటి వినియోగం పెరిగింది. ఇప్పటికే పలు ఏరియాల్లో బోర్లలో నీటి ధారలు తగ్గుతున్నాయి. దాంతో పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు.
7 బోర్లు వేసినా ఏడుపే మిగిలింది
రాజాపేట, ఫిబ్రవరి 18 : రాజాపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన రైతు రావి కొండల్‌రెడ్డి తనకు ఉన్న రెండు బోర్లతో ఈ యాసంగి ఏడెకరాల్లో వరి సాగు చేశాడు. రెండూ బోర్లు ఎండిపోవడంతో పంటను కాపాడుకోవడం కోసం అప్పు చేసి బోరు వెంట బోరు వేస్తూ మొత్తం ఏడు బోర్లు వేశాడు. ఏ ఒక్క దాంట్లోనూ నీళ్లు పడకపోవడంతో పంటంతా ఎండిపోయింది. దాంతో చేసేదిలేక వరి పైరును పశువులకు మేతకు వదిలివేశాడు. ఈసారి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందక పోవడంతో అప్పు చేసి మరీ వరి సాగు చేసినట్లు రైతు కొండల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఊళ్లో ఉన్న చెరువు ఎండిపోవడంతో బోర్లలో నీళ్లు అడుగంటాయని తెలిపాడు. ఏడు బోర్లు వేసినా చుక్క నీరు రాక ఏడుపే మిగిలిందని వాపోయాడు. ఎండిన పొలంలో పశువులను మేపుతున్నానని, పదేండ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని దుఃఖంతో చెప్పుకొచ్చాడు.