– సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
మాడ్గులపల్లి, జూలై 07 : మాడ్గులపల్లి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ యునాని వైద్యశాలను నూతన భవనంలో ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. మంగళవారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలను, యునాని వైద్యశాలను సీపీఎం మండల నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా హోమియోపతి వైద్య విధానంలో రోగులను గుర్తించి వారికి హోమియోపతి ప్రకారం ఆమోదించబడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేత గుర్తించబడిన మందులను అందజేస్తున్న ఆస్పత్రి పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు.ఎక్కడికక్కడ పెచ్చులూడిపోయి సరైనటువంటి గదులు, కరెంటు సదుపాయం కూడా లేక శిథిలావస్థలో ఉండి ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉండడం చాలా దారుణమైన విషయం అన్నారు. కావున తక్షణమే యునాని వైద్యశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలని కోరారు.
అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరి పాఠశాలకు 1-5 వ తరగతి వరకు కేవలం ఒకటే గది ఉండడం వలన విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రైమరీ విద్యా విధానం కూడా అందుబాటులోకి వస్తున్నందున వెంటనే అన్ని తరగతులకు సరిపడా గదులను, టీచర్లను ఏర్పాటు చేయాలన్నారు. నూతన గదుల ఏర్పాటుకు మండల కేంద్రంలో ఉన్న టోల్ ప్లాజా వారు సహకరిస్తామని చెప్పి షెడ్డు వేసి చుట్టూ గోడలు కట్టకపోవడం వలన అసంపూర్తిగా మిగిలిపోయిందన్నారు.ఈ విషయం గురించి వెంటనే టోల్ గేట్ యాజామాన్యాన్ని కలిసి గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి రొండి శ్రినివాస్, మండల కమిటీ సభ్యులు పుల్లెంల శ్రీకర్, పతాని శ్రీను, రైతు సంఘం మండల కార్యదర్శి దేవిరెడ్డి మల్లా రెడ్డి, మాడ్గులపల్లి 7వ వార్డు మెంబర్ గవ్వ రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.