కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. గోనె సంచుల కొరత ఉందని కొర్రీలు పెడుతున్నారు. ఆలస్యంగా కాంటా చేస్తున్నారు. ఒక లారీ లోడ్‌కు 10 నుంచి 15 బస్తాలు కోత పెడుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ప్రభుత్వం తమను బలవంతంగా ధాన్యం కొనుగోలు చేయిస్తోందని మిల్లర్లు బహిరంగంగానే చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్‌మిల్లర్ల మధ్యలో రైతులు నిండా మునుగుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి ట్రక్ షీట్ రాసిన లారీలకు తిరిగి రెండోసారి ట్రక్ షీట్ జారీ చేయకుండా… ధాన్యం తూకంలో కోతలు పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
గుండాల, మే 8: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు విలువ లేకుండా పోతోంది. మోత్కూర్‌కు చెందిన శ్రీరామకృష్ణ రైస్‌మిల్ యజమాని ధాన్యంలో నాణ్యత లేదంటూ బాహాటంగానే కోతలు పెడుతూ రైతులను నిండా ముంచుతున్నారు. మండలంలోని రామారంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత నెల 30న రైతు అట్ల మల్లారెడ్డికి చెందిన ధాన్యాన్ని తూకం వేసిన అనంతరం సెంటర్ ఇన్చార్జి అండెం అనిత 569 బస్తాలకు ట్రక్ షీట్ రాసిచ్చారు. తన వడ్లను తూకం వేశారని కొంత తృప్తి పడేలోగా శ్రీరామకృష్ణ రైస్ మిల్, ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి మల్లారెడ్డికి ఫోన్ చేసి దగ్గరకు పిలిపించుకున్నారు. ‘నీ ధాన్యం నాణ్యతగా లేదు.
14 బస్తాలు కటింగ్ చేస్తాం’ అని చెప్పడంతో మల్లారెడ్డి అవాక్కయ్యాడు. సారూ.. ‘మీకు దండం పెడతా.. నేను ఆరుగాలం కష్టం చేసి పండించిన ధాన్యాన్ని కటింగ్ చేయొద్దు’ అని వేడుకున్నా.. అదే లారీకి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండోసారి మల్లారెడ్డి పేరిట 14 బస్తాలను కోత పెట్టి 555 బస్తాలకు ట్రక్ షీట్ రాసిచ్చారు. రైతు దిక్కుతోచని పరిస్థితుల్లో ఏమీ చేయలేక వెనుదిరిగారు. వ్యవసాయ అధికారులు ధ్రువీకరించిన తర్వాత ధాన్యంలో కోత విధించడం చట్ట విరుద్ధమని తెలిసినా.. మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తాము చేసిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇది ఒక్క రామారంలోనే కాకుండా ఇలాంటి ఘటనలు మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంపై ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జి అనితను వివరణ కోరగా సీఈవో నాగయ్య చెప్పినట్లుగానే రెండు ట్రక్ షీట్లు రాసిచ్చానని చెప్పారు. మోత్కూర్ రామకృష్ణ రైస్‌మిల్ యజమాని మాట్లాడుతూ ప్రభుత్వం తమను బలవంతంగా వడ్లను కొనుగోలు చేసేలా వత్తిడి చేస్తోందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితులో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ధాన్యంలో కోతలు పెడుతున్నామని చెప్పుకొచ్చారు.